
విజయవాడ: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖల పర్వం కొనసాగుతోంది. సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందించి బహిరంగ లేఖలు రాస్తున్న ఆయన ఇవాళ విద్యుత్ సంస్కరణల విషయంలో సీఎం జగన్ వైఖరిని వ్యతిరేకిస్తూ లేఖ రాశారు. సీఎం జగన్ చేపడుతున్న ఈ సంస్కరణల పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ విముఖత చూపారని.. ఈ విషయం జగన్ తెలుసుకోవాలని ఆయన సూచించారు. రైతుల పొట్ట కొట్టే జీవో నెంబర్ 22 ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో శ్రీకాకుళం నుండే మరో విద్యుత్ పోరాటం ప్రారంభిస్తామన్నారు. మోడీ తీసుకువచ్చే సంస్కరణలకు సై అనటం తగదన్నారు. కేవలం రుణ పరిమితి పెంచుకునేందుకే ఉచిత విద్యుత్కు మీటర్ల బిగింపు ప్రక్రియను చేపడుతున్నారని విమర్శించారు . అమరావతి రాజధాని విషయంలో ఎలా మోసం చేశారో అదేవిధంగా ఉచిత విద్యుత్ విషయంలో రైతులను మోసం చేసేందుకు చూస్తున్నారని ఆయన ఆరోపించారు. 30 ఏళ్ల పాటు మీరే అధికారంలో ఉంటారనుకోవడం అత్యాశేనని ఆయన పేర్కొన్నారు.