
హైదరాబాద్, వెలుగు: స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్ల సర్దుబాటులో కలిసొచ్చే కాంగ్రెస్, సీపీఎంలతో కలిసి ముందుకెళ్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో ఈ నెల8న వెలువడనున్న కోర్టు తీర్పు ఆధారంగా, ఆ కేసులో సీపీఐ కూడా ఇప్లిండ్ అయ్యే విషయంపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. అలాగే, స్థానిక సంస్థల ఎన్నికల అంశంపై 5న జరిగే రాష్ట్ర సమావేశంలో చర్చిస్తామన్నారు. శుక్రవారం ఆయన పార్టీ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట రెడ్డి, జాతీయ సీనియర్ నేతలు సయ్యద్ అజీజ్ పాషా, రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈటీ నర్సింహ, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు వీఎస్ బోస్ తో కలిసి మీడియాతో మాట్లాడారు.
" బీసీల రిజర్వేషన్ల విషయంలో కొన్ని పార్టీలు ‘డబుల్ డ్రామాలు’ ఆడుతున్నాయి. ఎంపీటీసీ, ఎంపీపీ, జడ్పీటీసీ, సర్పంచ్, వార్డు స్థానాల్లో పోటీ చేసేందుకు కార్యకర్తలు, పార్టీ శ్రేణులు సిద్ధమవ్వాలి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైంది. సామాజిక కార్యకర్త సోనంను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నం " అని పేర్కొన్నరు. దేశ వృద్ధి 0.3 శాతం తగ్గిందని, ఉత్పత్తి రంగం 6 నుంచి 3.6 శాతానికి పడిపోయిందని సయ్యద్ అజీజ్ పాషా ఆవేదన వ్యక్తం చేశారు.