
రంగారెడ్డి కలెక్టరేట్, వెలుగు: అన్యాక్రాంతమవుతున్న ప్రభుత్వ భూములను కాపాడి, ఇండ్లు లేని పేదలకు ఇండ్ల స్థలాలివ్వాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ డిమాండ్‌చేశారు. సోమవారం రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్‌లోని కలెక్టరేట్ ఎదుట పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. పేదలకు ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇవ్వాలంటూ నినాదాలు చేశారు.
అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హయత్ నగర్ లో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవుతున్నాయని తెలిపారు. వాటిని పేదలకు 125 గజాల చొప్పున ఇవ్వాలన్నారు. కాంగ్రెస్ఎన్నికలకు ముందు పేద ప్రజలకు ఇండ్లు ఇండ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చిందని, దాన్ని పూర్తిస్థాయిలో నిలబెట్టుకోవాలని సూచించారు.
కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యుడు భూపాల్, జిల్లా కార్యదర్శి యాదయ్య, నాయకులు డీజీ.నర్సింగ్ రావు, చంద్రమోహన్, నర్సిరెడ్డి, ఎల్లయ్య, వెంకన్న, జగదీశ్, జగన్ తదితరులు పాల్గొన్నారు.