- సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖల్లో ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని పార్టీ ఆఫీస్లో మీడియాతో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేసి నోటిఫికేషన్ జారీ చేయాలని కోరారు. నిరుద్యోగ జేఏసీ చేపట్టే పోరాటాలకు మద్దతు తెలుపడంతోపాటు ప్రత్యక్షంగా పాల్గొంటామన్నారు. కేంద్ర ప్రభుత్వ శాఖల్లో సుమారు 60 లక్షల ఖాళీలు ఉన్నాయని, రైల్వే శాఖలోనే దాదాపు 10 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు.
రాష్ట్రం ప్రభుత్వం ఇప్పటివరకు16,798 పోస్టులను మాత్రమే భర్తీ చేసిందన్నారు. డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఆనగంటి వెంకటేశ్, రాష్ట్ర కార్యదర్శి కోట రమేశ్, నిరుద్యోగ జేఏసీ కన్వీనర్ ఆర్‌ఎల్ మూర్తి మాట్లాడుతూ జూన్ రెండో తేదీ నాటికి జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని, లేనిచో దశలవారీగా పోరాటాలు చేస్తామని హెచ్చరించారు.
