IND vs BAN: ఏమాటకామాట సూపర్బ్ క్యాచ్.. యువీని గుర్తు చేసిన జడేజా

 IND vs BAN: ఏమాటకామాట సూపర్బ్ క్యాచ్.. యువీని గుర్తు చేసిన జడేజా

వన్డే వరల్డ్ కప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఫీల్డింగ్‌తో అదరగొట్టాడు.   పక్షిలా గాల్లో ఎగురుతూ స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. అందుకు సంబంధించిన వీడియో క్షణాల్లో వైరల్‌గా మారడమే కాకుండా ఒకప్పుడు యువరాజ్ సింగ్ పట్టుకున్న ఐకానిక్ క్యాచ్‌ని గుర్తుచేస్తోంది.

బంగ్లా ఇన్నింగ్స్ 43వ ఓవర్‌లో బుమ్రా వేసిన ఓ బంతిని ముష్ఫికర్‌ రహీమ్‌ బ్యాక్‌వర్డ్ పాయింట్‌ మీదుగా బౌండరీకి తరలించాలనుకున్నాడు. సూపర్‌గా కట్‌ షాట్‌ ఆడాడు. బంతి కూడా బుల్లెట్‌ వేగంతో.. బ్యాక్‌వర్డ్ పాయింట్‌ కుడివైపుగా వెళ్తోంది. ఆ సమయంలో అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న జడేజా అమాంతం గాల్లో ఎగురుతూ రెండు చేతులా క్యాచ్‌ ఒడిసి పట్టుకున్నాడు. జడేజా ఆ క్యాచ్‌ పట్టిన విధానం సూపర్‌ అనే చెప్పుకోవాలి. ఎన్ని సార్లు చూసినా.. మళ్లీ మళ్లీ చూడాలనేపించేలా ఉంది ఆ క్యాచ్‌. ఈ మ్యాచ్‌లోనే టీమిండియా వికెట్‌ కీపర్‌ కేఎల్‌ రాహుల్‌ మరో సూపర్‌ క్యాచ్‌ అందుకున్నాడు. సిరాజ్‌ బౌలింగ్‌లో మోహదీ హసన్‌ క్యాచ్‌ను రాహుల్ అద్భుతంగా డైవ్ చేసి మరీ పట్టుకున్నాడు.

టార్గెట్ 257 

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి  256 పరుగులు చేసింది. ఓపెనర్లు తాన్జిద్‌ హసన్‌(51), లిటన్‌ దాస్‌(66) హాఫ్‌ సెంచరీలతో రాణించారు. లక్ష్య ఛేదనలో భారత ఓపెనర్లు ధీటుగా బదులిస్తున్నారు. మైదానం నలువైపులా బౌండరీలు బాదుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు. 12 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోర్.. 80/0. రోహిత్ శర్మ(41), గిల్ (39) పరుగులతో క్రీజులో ఉన్నారు.