బాయ్‌ఫ్రెండ్ సమక్షంలో స్మృతి మంధాన బర్త్ డే సెలెబ్రేషన్స్

బాయ్‌ఫ్రెండ్ సమక్షంలో స్మృతి మంధాన బర్త్ డే సెలెబ్రేషన్స్

భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన జూలై 18న(మంగళవారం) 27వ వసంతంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం భారత జట్టుతో కలిసి బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న ఈ అందాల భామ బంగ్లా గడ్డపైనే పుట్టినరోజు వేడుకలు జరుపుకుంది. అయితే ఈ వేడుకలకు ఓ ప్రత్యేక అతిథి హాజరైనట్లు కథనాలు వస్తున్నాయి. అతనెవరో కాదు.. మందాన బాయ్‌ఫ్రెండ్. అతని సమక్షంలోనే మంధాన బర్త్ డే సెలెబ్రేషన్స్ జరిగాయట.

స్మృతి మంధాన.. పాలక్ ముచ్చల్ సోదరుడు పలాష్ ముచ్చల్‌తో ప్రేమలో ఉన్న సంగతి అందరికీ విధితమే. ఈ విషయంపై వీరిద్దరూ ఇప్పటివరకూ ఎలాంటి ప్రకటన చేయనప్పటికీ.. కొద్దిరోజుల క్రితం(మే 22) పలాష్ పుట్టినరోజు వేడుకల్లో ఈ అమ్ముడు కనిపించటం ప్రేమ విషయాన్ని బహిర్గతం చేసింది. వీరి ప్రేమకు చిహ్నంగా ఇరువురి పేర్లు సూచించేలా పలాష్ చేతిపై SM అనే టాటూ కూడా ఉంది.

ఈ క్రమంలో ప్రియురాలిని పుట్టినరోజు నాడు సర్ప్రైస్ చేసేందుకు పలాష్ ఢాకా చేరుకున్నట్లు కథనాలు వస్తున్నాయి. అతని సమక్షంలోనే మంధాన బర్త్ డే సెలెబ్రేషన్స్ జరిగినట్లు తెలుస్తోంది. మంధానతో కలిసివున్న ఫోటోను పలాష్.. తన ఇన్‌స్టా ఖాతాలో  పోస్ట్ చేశారు. 28 ఏళ్ల పలాష్.. ప్రముఖ గాయకురాలు, సంగీత స్వరకర్త పాలక్ ముచ్చల్ తమ్ముడు. 

కాగా, బంగ్లా పర్యటనలో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 2-1 తేడాతో సొంతం చేసుకున్న టీమిండియా.. వన్డే సిరీస్‌లో 1-1 తేడాతో సమంగా ఉంది. తొలి వన్డేలో ఓటమిపాలైన భారత మహిళల జట్టు.. రెండో వన్డేలో గెలిచి సిరీస్  చేజారకుండా కాపాడుకోగలిగింది. ఇక నిర్ణయాత్మక మూడో వన్డే శనివారం(జూలై 22) జరగనుంది.