అక్రమ నిర్మాణాలకు అండగా నిలుస్తున్నారని.. ముగ్గురు ఆఫీసర్లపై క్రిమినల్ కేసు

అక్రమ నిర్మాణాలకు అండగా నిలుస్తున్నారని.. ముగ్గురు ఆఫీసర్లపై క్రిమినల్ కేసు

ఆర్మూర్ ఫస్ట్ క్లాస్ కోర్టు సంచలన ఆదేశాలు

ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ ఎ.శైలజతోపాటు ఎస్.హెచ్.ఓ రాఘవేందర్, రెవెన్యూ సర్వేయర్ శికారి రాజుపై కేసు

అక్రమ నిర్మాణాలు చేస్తున్న వారికి అండగా నిలిచారని ఆగ్రహం

ఆర్మూర్, వెలుగు: నకిలీ డాక్యుమెంట్లతో నిర్మాణాలు చేపట్టిన వారికి అండగా నిలుస్తున్నారంటూ ఆర్మూర్ ఫస్ట్​క్లాస్ కోర్టు ఆదేశాల మేరకు ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ ఎ.శైలజ, ఎస్ హెచ్ ఓ రాఘవేందర్, రెవెన్యూ సర్వేయర్ శికారి రాజుపై సోమవారం క్రిమినల్ కేసు నమోదైంది. బాధితురాలు, లాయర్ కథనం ప్రకారం… వేల్పూర్ కు చెందిన ఆస్మా సుల్తానా కోటార్మూర్ శివారులో ఎన్ హెచ్ 63ను ఆనుకుని ఉన్న స్థలాన్ని కొని రిజిస్ట్రేషన్ చేయించుకుంది. కొటార్మూర్ కు చెందిన గోపిడి నర్సయ్య, కొప్పెల లక్ష్మి, కొప్పెల దశరథ్ ఈ ప్లాట్లకు నేషనల్ హైవే మధ్య తమ స్థలం ఉందంటూ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఆస్మా సుల్తానా రిజిస్ట్రేషన్ చేయించుకున్న ప్లాట్లలో కొంత స్థలాన్ని, హైవేను ఆనుకుని ఉన్న కొంత స్థలాన్ని తమ ప్లాట్లుగా చూపుతూ ఈ ముగ్గురు ఇండ్ల నిర్మాణ పనులు చేపట్టారు. దీంతో బాధితురాలు కోర్టును ఆశ్రయించింది.

పనులు నిలిపి వేయాలని కోర్టు ఆదేశించినప్పటికీ కొనసాగిస్తున్నారు. మున్సిపల్ కమిషనర్ కు ఫిర్యాదు చేసినా పట్టనట్లుగా వ్యవహరించారని ఆరోపిస్తూ బాధితురాలు మరోసారి కోర్టును ఆశ్రయించింది. దీంతో బాధితురాలి పేర ప్లాట్లు రిజిస్ట్రేషన్ అయిన 10 /1 సర్వేనంబరు భూమి, ఇల్లు నిర్మిస్తున్న వారి ప్లాట్లు రిజిస్ట్రేషన్ అయిన 9/5 సర్వే నంబర్ భూమి కొటార్మూర్​ లో ఎక్కడ ఉన్నాయో తేల్చాలని మండల రెవెన్యూ సర్వేయర్​, ఇద్దరు అడ్వకేట్లతో కోర్టు అడ్వకేట్ ​కమిషన్ ను నియమించింది. ఆ తర్వాత సర్వేయర్​ తప్పుడు నివేదిక సమర్పించాడని బాధితురాలు కోర్టులో ఆధారాలతో సహా కోర్టుకు తెలిపింది.

దీంతో ఆమె పక్షాన లాయర్ల వాదనతో అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్న మున్సిపల్ కమిషనర్, సర్వేయర్ పై పోలీసులు కేసు నమోదు చేయాలని ఆదేశిస్తూ ఆర్మూర్ ఎస్​ హెచ్​ వో రాఘవేందర్ కు రిజిస్టర్​ పోస్టు ద్వారా పంపారు. అయినప్పటికీ పోలీసులు కేసు నమోదు చేయడంలేదని బాధితురాలు మళ్లీ కోర్టును ఆశ్రయించింది. దీంతో కోర్టు ఆదేశాల మేరకు సోమవారం మున్సిపల్ కమిషనర్ శైలజ, సర్వేయర్ శికారి రాజు, ఎస్​హెచ్​వో రాఘువేందర్ ఆర్మూర్ పోలీస్ స్టేషన్​ లో క్రిమినల్​ కేసు నమోదైంది.