- ఫేషియల్ రికగ్నేషన్ సిస్టమ్ తో క్రిమినల్స్ కు చెక్ పెడుతున్న పోలీసులు
- సిటీ కమిషనరేట్ లో సక్సెస్
- రాష్ట్ర వ్యాప్తంగా అమలుకు ప్లాన్
హైదరాబాద్, వెలుగు: ఫేషియల్ రికగ్నేషన్ సిస్టమ్‌తో క్రిమినల్స్‌కి పోలీసులు చెక్ పెడుతున్నారు. నేరస్తుల మూవ్‌మెంట్స్ గుర్తించి నిఘా పెడుతున్నారు. వివిధ నేరాల్లో అనుమానితుల ఫొటోలను క్యాప్చర్ చేసి, పాత నేరస్తుల డేటాతో స్కాన్ చేసి నిందితులను పట్టుకుంటున్నారు. ఈ టూల్స్ ఆధారంగా మిస్సింగ్ అయిన చిన్నారులను ట్రేస్ చేస్తున్నారు. క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్‌వర్క్ సిస్టమ్ ( సీసీటీఎన్‌ఎస్), టీఎస్ పోలీస్ క్రైమ్ డేటా ఆధారంగా నేరస్తులను గుర్తిస్తున్నారు. ఈ ఏడాది జూన్ వరకు 8 మందిని ఇలాగే అరెస్టు చేశారు. కొంతమంది దొంగలను గుర్తించారు.
పోయినేడు 33 మంది పిల్లలను కాపాడిన్రు
సీసీటీవీ ఫుటేజీల ద్వారా క్యాప్చర్ చేసే వీడియో, ఫొటోల ఆధారంగా స్థానిక పోలీసులను అలెర్ట్ చేస్తున్నారు. నేరం జరిగిన ప్రాంతాల్లో సేకరించే సీసీటీవీ ఫుటేజీలను రికగ్నేషన్ సిస్టమ్‌తో స్కాన్ చేస్తున్నారు. డేటా ఆధారంగా అనుమానితులపై నిఘా కొనసాగించేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే మిస్సింగ్ అయిన చిన్నారులను గుర్తిస్తున్నారు. పోయినేడాది 33 మంది పిల్లలను కాపాడారు. వీఐపీల బహిరంగ సభలు, ఉత్సవాల సమయాల్లోనూ సీసీటీవీ ఫుటేజీలను స్కాన్ చేస్తున్నారు. సిటీలో ఇప్పటికే మంచి ఫలితాలు ఇస్తున్న ఫేషియల్ రికగ్నేషన్ సిస్టమ్‌ను రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కమిషరేట్ల పరిధిలో అమలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
15 రకాలుగా స్కాన్
పోలీసులు హైదరాబాద్‌లోని రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, పబ్లిక్ ప్లేసులలో హైడెఫినేషన్ సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వీటిని సిటీ కమిషనరేట్‌లోని ఫేషియల్ రికగ్నేషన్ ల్యాబ్‌కి కనెక్ట్ చేశారు. సీసీటీవీ ఫుటేజీల ద్వారా క్యాప్చర్ చేసిన అనుమానితుల ఫొటోలను పాత నేరస్తుల డేటాతో పోల్చి చూస్తున్నారు. ఫేషియల్ రికగ్నేషన్ టూల్ ద్వారా 15 రకాలుగా ఫొటోలను స్కాన్ చేస్తున్నారు. క్రిమినల్ డేటాలోని నేరస్తులతో పోలిన ఫొటోలను టీఎస్ కాప్ అనుమానితుల డేటాలో అప్‌లోడ్ చేస్తున్నారు. వీటిని బ్లూకోల్ట్, పెట్రోలింగ్ పోలీసులు, ఉన్నతాధికారులకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతున్నారు. ఫేషియల్ రికగ్నేషన్ సిస్టమ్‌తో ఒకేసారి వందల సంఖ్యలో సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించే అవకాశం ఉంది.
