13 జనవరి 2026న భారత ప్రభుత్వం యూజీసీ (యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్) కులవివక్ష రెగ్యులేషన్స్‌పై గెజిట్ విడుదల చేసిన రోజు నుంచి 15 రోజులపాటు ఉత్తర భారతాన ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, బిహార్వంటి రాష్ట్రాల్లో జనరల్ కులాలు (అగ్రకులాలు) ప్రధాని మోదీ, అమిత్ షాపై తీవ్ర విమర్శలు ఎక్కుపెట్టాయి. మోదీ, షా ఫ్లెక్సీలకు నల్లరంగు రుద్దారు. బీజేపీ జెండాలను పీకేయడం వరకూ వెళ్లింది.
మొన్నటిదాకా మోదీని పొగిడినవారే ఇప్పుడు తీవ్ర విమర్శలకు దిగడం చూస్తే.. యూజీసీ కొత్త నిబంధనల్లో ఏముంది..? అది జనరల్కులాలకు ఎందుకు ఆగ్రహం తెప్పించింది? ముఖ్యంగా ఓబీసీలను మరింత అక్కున చేర్చుకోవడానికే ఆ నిబంధనలను తెచ్చారా? రాహుల్‌గాంధీ సోషల్ ఈక్వాలిటీకి, అఖిలేష్ ‘ పీడీఏ’ వాదాలకు జవాబుగా.. మోదీ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలను ఆకట్టుకునే వ్యూహానికి యూజీసీ కొత్త నిబంధనలతో పదును పెడుతున్నారా? అనేదే చర్చనీయాంశం.
యూజీసీలో తెచ్చిన కొత్త రెగ్యులేషన్స్ప్రకారం కులవివక్షకు గురయ్యే వారి జాబితాలో ఎస్సీ, ఎస్టీలతో పాటు ఓబీసీలను కొత్తగా చేర్చారు. ఓబీసీలను కూడా అందులో చేర్చడంతో మిగిలిన అగ్రకులాలే దోషులవుతారా అనేది జనరల్కులాల భయం. ఎవరు ఫిర్యాదు చేసినా అది నిజమో కాదో తేల్చే నిబంధనే ఆ చట్టంలో లేనపుడు విశ్వవిద్యాలయాల్లో, కళాశాలల్లో అగ్రకులాలవారు చదివే దెలా..? పనిచేసేదెలా..? అనేదే అగ్రకులాలవారిని ఆందోళనలకు ప్రేరేపించింది.
ఇది చివరకు సుప్రీంకోర్టుకు చేరింది. సుప్రీంకోర్టు యూజీసీ కొత్త నిబంధనలపై స్టే విధించింది. ‘ఈ కొత్త నిబంధనలు స్ఫష్టంగా లేవు, ఈ చట్టం దుర్వినియోగం అయ్యే అవకాశం ఉంది’ అని కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. కేసును 26 మార్చి నెలకు వాయిదా వేసింది. అప్పటివరకు పాత చట్టం 2012 అమలులో ఉంటుందని చెప్పింది. కొత్త కమిటీ వేసి ఎవరికీ అన్యాయం జరగకుండా కొత్త నిబంధనలు తేవాలని సూచించింది.
ఏ పార్టీ స్పందించలేదు!
మొదట్లో యూజీసీ రెగ్యులేషన్స్‌పై అన్ని పార్టీలు కూడా మౌనాన్నే పాటించాయి. ఎప్పుడూ ఒంటికాలిపై లేచే రాహుల్‌గాంధీ కూడా గొడవను మౌనముద్రలో ఉంటూ ఎంజాయ్ చేస్తున్నట్టనిపించింది. అది ఎటువైపు మలుపు తిరుగుతుందో అని ఎదురు చూస్తున్నట్లుంది. ఈ సంక్షోభంపై బీజేపీలోనూ అంతర్గతంగా బయటికి కనిపించని డివిజన్ ఏర్పడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద సుప్రీం కోర్టు స్టే విధించడాన్ని మాత్రం అన్ని పార్టీలు స్వాగతించడం కొసమెరుపు. సుప్రీంకోర్టు స్టే ఇచ్చిన తర్వాత ఆందోళనలు కాస్త సద్దుమణిగాయి. కానీ జనరల్కులాల్లో బీజేపీపై ఆగ్రహం మాత్రం తగ్గలేదు.
కొత్త నిబంధనల నేపథ్యం
కుల వివక్షపై యూజీసీ కొత్త నిబంధనలు ఎందుకు వచ్చాయంటే, గతంలో రోహిత్‌వేముల తల్లితో పాటు మరొకరి పిటిషన్మేరకు, సుప్రీంకోర్టు ఉన్నత విద్యాసంస్థల్లో కులవివక్షపై పటిష్టమైన రెగ్యులేషన్స్తేవాలని యూజీసీని ఆదేశించింది. ఎవరికీ అన్యాయం జరగొద్దనేది కొత్త నిబంధనల్లో ఎందుకు కొరవడింది అనేదే ప్రశ్న. అందుకు వేళ్లన్నీ మోదీ ప్రభుత్వం వైపే చూపడం సహజం. అందుకే ఉత్తరప్రదేశ్, బిహార్ వంటి రాష్ట్రాలలో జనరల్ కులాల వారు ప్రత్యక్షంగా ప్రధాని మోదీయే టార్గెట్‌గా తమ నిరసనలు, ర్యాలీలు చేశారు.
బీజేపీ ఉక్కిరి బిక్కిరి
మోదీ పట్ల జనరల్ కులాలకు ఇప్పటివరకు ఉన్న అభిమానమంతా మంచులా కరిగిపోవడం బీజేపీని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నది. బీజేపీ కోర్ ఓట్‌బ్యాంక్ ఇలా తిరుగుబాటు చేయడం ముమ్మాటికి ఆపార్టీకి ఒక చేదు అనుభవమే. అది ఎటు దారితీస్తుందనేదే ఆ పార్టీ నేతలను ఆందోళనకు గురిచేస్తున్నది. మోదీ 12 ఏండ్ల పాలనలో తన ఓటు బ్యాంకు నుంచే ఇలా వ్యతిరేకతను ఎదుర్కొవడం ఇదే మొదటిసారి. నిజానికి జనరల్కులాల నుంచి వ్యతిరేకతను మోదీ ఊహించి ఉండరు. పన్నేండ్ల మోదీ పాలనకు యూజీసీ కొత్త రెగ్యులేషన్స్ లొల్లి ఒక చేదు అనుభవం అనేకంటే, వ్యూహాత్మక నిర్ణయమేనేమో?
వ్యూహాత్మక రాజనీతా?
అగ్రకులాలు బీజేపీని ఎంత విమర్శిస్తే, ఎస్పీ, ఎస్టీ, ఓబీసీలు బీజేపీకి పక్కా ఓటర్లుగా మారుతారనే వ్యూహాత్మకతనా? ఓబీసీల పార్టీగా విరాజిల్లే వ్యూహాత్మక రాజనీతా? బీజేపీ ఒక చేతిలో కమండల్, మరొక చేతిలో మండల్చేపట్టే దిశగా దాని రాజకీయం నడుపుతోందా? జనరల్ కులాల అభ్యంతరాలకు అనుగుణంగా కొత్త యూజీసీ చట్టంలో కొన్ని మార్పులు చేస్తే జనరల్ కులాలను కూడా మెప్పించవచ్చని మోదీ భావన కావచ్చేమో! చిత్ బీజేపీదే, పట్ బీజేపీదే అన్నట్లుగా బీజేపీ వ్యూహాత్మక రాజకీయం నడుపుతోందా?
రాహుల్, అఖిలేశ్ ఎఫెక్ట్
రాహుల్ గాంధీ ‘సోషల్ ఈక్వాలిటీ’ రాజకీయంబీజేపీని చాలాకాలంగా ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో.. బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందని రాహుల్ గాంధీ చేసిన ప్రచారం ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, హర్యానా లాంటి ఉత్తరాది రాష్ట్రాల్లో బాగా ప్రభావం చూపింది. ఫలితంగా ఉత్తరాదిలో బీజేపీ సుమారు 45 నుంచి 50 స్థానాలు కోల్పోయింది. దాంతో మెజారిటీకి దూరమైంది.
ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలే లక్ష్యంగా రాహుల్ గాంధీ, అఖిలేశ్ యాదవ్‌లు నడుపుతున్న రాజకీయాలు బీజేపీని ఉత్తరాదిలో అడపాదడపా ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి. అయినా కూడా ఇప్పటికీ ఉత్తరాది రాష్ట్రాల్లో అగ్రకులాల కంటే, ఓబీసీల ఓట్లే బీజేపీని గెలిపిస్తూ వస్తున్నాయనేది కాదనలేని సత్యం.
రాహుల్, అఖిలేశ్‌ల రాజకీయానికి వ్యూహాత్మకంగా చెక్ పెట్టేందుకే.. యూజీసీ కొత్త నిబంధనల్లో వివక్షకు గురయ్యే కులాల జాబితాలో ఓబీసీలను కూడా చేర్చారనేది మోదీ వ్యూహాత్మకత తెలిసిన రాజకీయ పండితుల అభిప్రాయం కూడా. ఓబీసీ ఓటు బ్యాంకు లేనిదే అధికారంలోకి రాలేమని మోదీతో పాటు రాహుల్‌కూ తెలుసు. యూపీ, బిహార్, రాజస్థాన్, బిహార్ వంటి ఉత్తరాది రాష్ట్రాలలోనే మోదీ వర్సెస్ రాహుల్, అఖిలేశ్‌ల రాజకీయాలు ఓబీసీల చుట్టే తిరుగుతున్నాయి.
ఇందిర తర్వాత అంతటి సమర్థ ప్రధానిగా.. ఇదా?
1989 నుంచి 2014 వరకు దేశంలో రాజకీయ అస్థిరత తాండవించింది. ఇందిరాగాంధీ తర్వాత దేశంలో అంతటి రాజకీయ సుస్థిరత సాధించిన ఏకైక ప్రధానిగా నరేంద్ర మోదీకే పేరుంది. అలాంటి ప్రధాని ఉండగా ఈ మధ్య కొన్ని విషయాల్లో కేంద్ర ప్రభుత్వ పనితీరు ఏమాత్రం బాగాలేదనే చర్చ జరుగుతోంది. ఇండిగో విమాన సంస్థ నెలరోజులపాటు ప్రయాణీకులను ఇబ్బంది పెట్టడం. ఉత్తర భారత వాతావరణాన్ని కాపాడుతున్న ఆరావళి పర్వత శ్రేణులను అమ్మకానికి (లీజులకు) పెట్టడం. దాన్ని కోర్టు ఆపేయడం. ఇపుడు స్పష్టతలేని యూజీసీ కొత్త నిబంధనలు తెచ్చి సమాజంలో మరింత విభజనను పెంచినట్లు కావడం.. ఇవేనా మోదీ సమర్థతకు సంకేతాలు?
యూజీసీ నుంచి ట్రేడ్ డీల్ దాకా..
ఇకపోతే.. నిన్న రాత్రి అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ భారత్‌తో ట్రేడ్ డీల్ కుదిరిందని ప్రకటించాడు. 50 శాతం నుంచి 18శాతానికి సుంకాల తగ్గింపు! భారత్‌లోకి అమెరికా నుంచి దిగుమతులపై మన సుంకాలు మాత్రం ‘సున్నా’! భారత్‌లోకి అమెరికా వ్యవసాయోత్పత్తులకు అనుమతి! మరి మన వ్యవసాయం ఏం కానుంది? అమెరికా వ్యవసాయోత్పత్తుల దిగుమతులను ఒప్పుకోవద్దనే ఇంతకాలం ట్రేడ్ డీల్‌ను మనం ఆపినాం!
ఇపుడు అమెరికా వ్యవసాయోత్పత్తుల దిగుమతులపై డీల్ ఎలా కుదిరింది? అది కూడా ట్రంపే ప్రకటించడం! మన ప్రధాని కృతజ్క్షతలు చెప్పడం! ఇంతకాలం భారతీయుల్లో మోదీ పట్ల ఉన్న విశ్వాసం ఇపుడు ఏంకానుంది? స్వయానా మోదీ ఆలోచించకపోయినా.. ఈ దేశ ప్రజలు ఆమెరికా ట్రేడ్ డీల్ పట్ల మాత్రం తప్పక ఆలోచిస్తారు! యూజీసీ నుంచి ట్రేడ్ డీల్ దాకా మోదీ పాలనకు అన్నీ ప్రశ్నలే ఎదురవుతాన్నాయి మరి!
రాబోయే కాలంలో యూజీసీ సమస్య భారత రాజకీయాల దశా దిశను మార్చనున్నాయా అంటే కాలమే చెప్పాలి. బీజేపీ ఇపుడు సర్వ సమాజ పార్టీ కాదు, గెలుపు సమాజ పార్టీ అని అంతా అంటున్నారు. బీజేపీ అంటే కమండలే కాదు, మండల్ కూడా అనే నిరూపణ ఆరాటంలోనే యూజీసీ కొత్త నిబంధనలు తెచ్చారా? కులాలకు అతీతంగా హిందువులను ఏకం చేస్తామనే బీజేపీయే.. ఇపుడు కులాల లెక్కలతో అదే హిందూ సమాజాన్ని చీలుస్తోందని దాని అభిమానులే ఉత్తర భారతాన ఆగ్రహిస్తున్నారు! ‘బటేంగే తో కటేంగే’ అది నిన్నటి నినాదం. కులాల పేర ‘కటేతో హీ జీతేంగే’ అనేది నేటి నినాదమా అని ప్రశ్నిస్తున్నారు!
- కల్లూరి శ్రీనివాస్‌రెడ్డి
సీనియర్ జర్నలిస్ట్
