యుద్ధం చేయలేక రాహుల్​పై విమర్శలా ? ప్రధాని మోదీపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్

యుద్ధం చేయలేక రాహుల్​పై విమర్శలా ? ప్రధాని మోదీపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్
  • ట్రంప్ ఒత్తిడికి తలొగ్గే.. మోదీ కాల్పుల విరమణ ప్రకటించారు
  • మోదీ వెనుక ఉంటానన్న కిషన్ రెడ్డి ఇంట్లో పడుకున్నడు 
  • దేశం కోసం ప్రాణాలర్పించిన చరిత్ర గాంధీ ఫ్యామిలీది
  • పాకిస్తాన్​కు ​గుణపాఠం చెప్పిన ఉక్కుమహిళ ఇందిరాగాంధీ అని వ్యాఖ్య
  • రాజీవ్ వర్ధంతి సందర్భంగాసెక్రటేరియట్ వద్ద విగ్రహానికి నివాళి

హైదరాబాద్, వెలుగు: పాకిస్తాన్​పై యుద్ధం చేయలేక చేతగానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు రాహుల్ గాంధీపై ప్రధాని మోదీ విమర్శలు చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు.  పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ‘ఆపరేషన్ సిందూర్’ ను చేపట్టిన మోదీ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడికి తలొగ్గి,  కాల్పుల విరమణ ప్రకటించారని విమర్శించారు.

బుధవారం (May 22) జాతీయ ఉగ్రవాద వ్యతిరేక దినం (రాజీవ్​గాంధీ వర్ధంతి) సందర్భంగా  సెక్రటేరియెట్ ఎదురుగా ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహానికి రేవంత్​ రెడ్డి పూలమాల వేసి,  నివాళి అర్పించారు.  అనంతరం సీఎం రేవంత్​ రెడ్డి మాట్లాడుతూ.. పాకిస్తాన్ కు శాశ్వతంగా గుణపాఠం చెప్పేందుకు భారత్ కు ఒక మంచి అవకాశం వస్తే, దాన్ని మోదీ వినియోగించుకోలేకపోయారని అన్నారు. ఆయన ఎవరికీ తలొగ్గకుండా యుద్ధం కొనసాగిస్తే.. యావత్తు దేశమంతా ప్రధాని వెనుక ఉండేదని చెప్పారు. మోదీకి చేతనైతే ఉగ్రవాదాన్ని శాశ్వతంగా అణిచివేసే చర్యలు తీసుకోవాలని సవాల్​ చేశారు. రాహుల్ గాంధీని నిందించడం బీజేపీ నేతల చేతగానితనమేనని అన్నారు.  

దేశ సమగ్రత విషయంలో రాజకీయాలు చేయం

ఈ యుద్ధంలో మోదీ వెనుక ఉంటానని చెప్పిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. కేంద్రానికి అండగా ఉండాల్సిన సమయంలో  ఇంట్లో దుప్పటి కప్పుకొని పడుకున్నారని రేవంత్​రెడ్డి విమర్శించారు. తాము బయటకు వచ్చి కేంద్రానికి అండగా ఉంటామని ప్రకటించి, మద్దతు ఇచ్చామని తెలిపారు. అంతచేస్తే ఆనాడు కనీసం తమను అభినందించని వ్యక్తి, ఇప్పుడు రాహుల్ పై విమర్శలు చేస్తున్నాడని కిషన్ రెడ్డిపై మండిపడ్డారు.

సంకుచిత మనస్తత్వం కలిగిన కొందరు రాజీవ్ గాంధీని విమర్శిస్తున్నారని, దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన చరిత్ర గాంధీ కుటుంబానిది, కాంగ్రెస్ పార్టీది అని అన్నారు. దేశ రక్షణ కోసం భారత  జవాన్లకు అండగా నిలబడుతామని, అది తమ బాధ్యత అని స్పష్టం చేశారు. దేశ సమగ్రత విషయంలో తాము రాజకీయాలు చేయబోమని, దేశ భద్రతకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. 

దేశ ప్రజలు ఇందిరా గాంధీని గుర్తుచేసుకుంటున్నరు

పహల్గాం దాడి అనంతరం పాకిస్తాన్ పై భారత్ చేసిన దాడి తర్వాత దేశంలోని ప్రతి ఒక్కరూ  ప్రధానిగా ఉక్కు మహిళా ఇందిరా గాంధీ 1971 లో చేసిన యుద్ధాన్ని గుర్తు చేసుకున్నారని రేవంత్​రెడ్డి చెప్పారు. ఉగ్రవాదుల ముసుగులో దేశ పౌరులపై దాడులకు తెగబడితే ఆనాడు ఇందిరాగాంధీ.. పాకిస్తాన్​కు​ గట్టి సమాధానం చెప్పారని అన్నారు. పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్​ను వేరుచేసి దాయాది దేశానికి ఇందిరాగాంధీ  గుణపాఠం చెప్పారని తెలిపారు.

ఆనాడు దేశ రక్షణ కోసం ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదని  కరాఖండిగా చెప్పిన ఇందిరాగాంధీ.. ఆచరించి చూపించారని అన్నారు. 18 ఏండ్లకే యువతకు ఓటు హక్కును కల్పించిన ఘనత రాజీవ్ గాంధీదే అని తెలిపారు.   ప్రభుత్వాల ఏర్పాటులో యువతకు భాగస్వామ్యం కల్పించారని చెప్పారు. ఆర్థిక సరళీకృత విధానాలతో దేశానికి బలమైన పునాదులు వేశారని తెలిపారు. ప్రధానిగా దేశానికి వన్నె తెచ్చిన మహా నాయకుడు రాజీవ్ గాంధీ అని కొనియాడారు. 

రాజీవ్​గాంధీ బాటలోనే రాష్ట్రంలో పాలన: మహేశ్​ గౌడ్​

భారత దేశ స్వాప్నికుడు రాజీవ్ గాంధీ అని, ఆయన మార్గంలోనే రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాలన సాగిస్తున్నారని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన గొప్ప నేత రాజీవ్ గాంధీ అని కొనియాడారు. ఇప్పుడు మన మధ్య లేకపోయినా ఆయన ఆశయాలను కొనసాగించే బాధ్యత ప్రతి కాంగ్రెస్ కార్యకర్తపై ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, ఇతర నేతలు పాల్గొన్నారు.


దేశ ప్రజలు ఇందిరను గుర్తుచేసుకుంటున్నరు

పహల్గాం ఘటన అనంతరం పాకిస్తాన్ పై భారత్ చేసిన దాడి తర్వాత దేశంలోని ప్రతి ఒక్కరూ  ప్రధానిగా ఉక్కు మహిళా ఇందిరా గాంధీ 1971 లో చేసిన యుద్ధాన్ని గుర్తు చేసుకున్నరు. టెర్రరిస్టుల ముసుగులో దేశ పౌరులపై దాడులకు తెగబడితే ఆనాడు ఇందిరాగాంధీ.. పాకిస్తాన్​కు గట్టి సమాధానం చెప్పారు. పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్​ను వేరుచేసి దాయాది దేశానికి ఆమె గుణపాఠం చెప్పారు. ఆనాడు దేశ రక్షణ కోసం ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదని  కరాఖండిగా చెప్పిన ఇందిరాగాంధీ.. దాన్ని ఆచరించి చూపించారు.
- సీఎం, రేవంత్​రెడ్డి