వానలతో జనం ఆగమైతుంటే.. పుట్టిన రోజు వేడుకలా?

వానలతో జనం ఆగమైతుంటే.. పుట్టిన రోజు వేడుకలా?

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వారం రోజులుగా వర్షాలు, వరదలతో జనం అతలాకుతలం అవుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ప్రజలను ఆదుకోవడంలో కేసీఆర్  ప్రభుత్వం విఫలమైందని పీసీసీ చీఫ్  రేవంత్​ రెడ్డి మండిపడ్డారు. సీఎం కేసీఆర్​గానీ, మున్సిపల్​ శాఖ మంత్రి కేటీఆర్​కానీ ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదని ఆయన విమర్శించారు. తన పుట్టినరోజు మోజులో ఉన్న కేటీఆర్.. ప్రజలను మరిచిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్షాలపై రాష్ట్ర సర్కారు కనీసం సమీక్ష కూడా చేయడం లేదని బుధవారం ఓ ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. అతిభారీ వర్షాల కారణంగా వాతావరణ శాఖ ఇప్పటికే రెడ్​ అలర్ట్​ ప్రకటించినా రాష్ట్ర ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవడం లేదని విమర్శించారు.

హైదరాబాద్​ విశ్వనగరమంటూ గొప్పలు చెప్పారు. హైదరాబాద్​ను డల్లాస్​, ఓల్డ్​ సిటీని ఇస్తాంబుల్​ చేస్తామంటూ కేసీఆర్, కేటీఆర్​లు ప్రగల్భాలు పలికారు. కానీ, నగరాన్ని నరకకూపంగా మార్చారు. చిన్న వర్షానికే జనం ట్రాఫిక్​ సమస్యలతో యాతన పడుతున్నారు’’ అని రేవంత్  వ్యాఖ్యానించారు. తొమ్మిదేండ్లలో హైదరాబాద్​ సిటీలో సౌకర్యాల కల్పనపై చర్యలు చేపట్టలేదన్నారు. కనీసం ఈ రెండు రోజులైనా ప్రభుత్వం ప్రజలకు సరైన సేవలందించాలని ఆయన డిమాండ్​ చేశారు. కాగా, రాష్ట్రంలో వర్షాల పరిస్థితిపై డీసీసీ అధ్యక్షులు, హైదరాబాద్​ సిటీ నేతలతో పీసీసీ వర్కింగ్​ ప్రెసిడెంట్​ మహేశ్​కుమార్​ గౌడ్​ జూమ్​ మీటింగ్​ ద్వారా సమీక్ష నిర్వహించారు..

ఓఆర్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ టోల్ వివరాలు ఇస్తలేరు

ఔటర్‌‌‌‌ రింగ్‌‌‌‌ రోడ్‌‌‌‌ టోల్‌‌‌‌ ఆపరేట్‌‌‌‌ ట్రాన్స్‌‌‌‌ఫర్‌‌‌‌‌‌‌‌(టీఓటీ) కాంట్రాక్ట్‌‌‌‌కు సంబంధించిన వివరాలను ప్రభుత్వం ఇవ్వడం లేదంటూ పీసీసీ చీఫ్‌‌‌‌ రేవంత్‌‌‌‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద వివరాలు ఇవ్వాలని అడిగినా పూర్తి సమాచారం ఇవ్వడం లేదన్నారు. టీఓటీకి సంబంధించిన వివరాలను ఇచ్చేలా ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేయాలని కోర్టులో రిట్ పిటిషన్‌‌‌‌ దాఖలు చేశారు. మే 1న అప్లికేషన్‌‌‌‌ పెట్టుకుంటే పాక్షిక సమాచారమే అధికారులు ఇచ్చారని, మిగిలిన సమాచారం ఇవ్వడం లేదని తెలిపారు. దీంతో జూన్‌‌‌‌ 14న మరోసారి దరఖాస్తు చేసినట్లు చెప్పారు. ట్రాన్సాక్షన్‌‌‌‌ అడ్వయిజర్‌‌‌‌ ఇచ్చిన నివేదిక, 30 ఏండ్ల లీజుపై మంత్రి మండలి నిర్ణయం, 2021=22, 2022=23 ఆదాయ వివరాలను కోరినా ఇవ్వడం లేదని కోర్టు దృష్టికి తెచ్చారు.