సెక్యూరిటీ ప్రొటోకాల్.. రాహులే పాటిస్తలేరు

సెక్యూరిటీ ప్రొటోకాల్.. రాహులే పాటిస్తలేరు
  • కాంగ్రెస్ ఆరోపణలను కొట్టిపారేసిన సీఆర్పీఎఫ్ 

న్యూఢిల్లీ: కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీకి గైడ్ లైన్స్ ప్రకారం పూర్తి స్థాయిలో సెక్యూరిటీ కల్పించామని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) అధికారులు గురువారం తెలిపారు. కానీ రాహులే సెక్యూరిటీ ప్రొటోకాల్​ను ఉల్లంఘించారని చెప్పారు. ఆయన మూడేండ్లలో 113 సార్లు సెక్యూరిటీ ప్రొటోకాల్ ఉల్లంఘించారని పేర్కొన్నారు. రాహుల్ భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు బుధవారం లెటర్ రాశారు. 

భారత్ జోడో యాత్ర ఢిల్లీలోకి ఎంటరైన టైమ్​లో భద్రతా ఉల్లంఘనలు జరిగాయని ఆయన ఆరోపించారు. యాత్ర సందర్భంగా రాహుల్ కు భద్రత పెంచాలని కోరారు. ఈ ఆరోపణలను సీఆర్పీఎఫ్​ అధికారులు కొట్టిపారేశారు. ‘‘జోడో యాత్ర ఢిల్లీకి రావడానికి ముందే పోలీసులతో సమావేశం కాగా.. తగినంత సిబ్బందిని మోహరించామని వాళ్లు చెప్పారు. భద్రతా పరంగా ఎలాంటి ఇబ్బందులు రావొద్దంటే.. ఆ భద్రతను పొందే వ్యక్తి కూడా సెక్యూరిటీ ప్రొటోకాల్ పాటించాలి. కానీ రాహుల్ చాలాసార్లు ప్రొటోకాల్ ఉల్లంఘించారు. 2020 నుంచి ఇప్పటి వరకు 113 సార్లు ప్రొటోకాల్ ఉల్లంఘించారు” అని పేర్కొన్నారు.'