V6 News

పర్సంటేజీ సెగ.. ఫిల్మ్ ఛాంబర్‌లో హై-వోల్టేజ్ మీటింగ్.. మే 1 నుంచి సింగిల్ స్క్రీన్స్ బంద్?

పర్సంటేజీ సెగ.. ఫిల్మ్ ఛాంబర్‌లో హై-వోల్టేజ్ మీటింగ్.. మే 1 నుంచి సింగిల్ స్క్రీన్స్ బంద్?

తెలుగు సినీ ఇండస్ట్రీలో థియేటర్ల నిర్వహణ, పంపిణీ వ్యవస్థలో నెలకొన్న ఉత్కంఠ కొనసాగుతోంది. 'పర్సంటేజీ' విధానంపై తేల్చిచెప్పకపోతే  తెలంగాణలోని సింగిల్ స్క్రీన్ థియేటర్లను మూసివేస్తామని ఎగ్జిబిటర్ల సంఘం ఇప్పటికే హెచ్చరించింది. ఈనేపథ్యంలో హైదరాబాద్‌లోని ఫిల్మ్ ఛాంబర్ వేదికగా గురువారం ( ఏప్రిల్ 16న ) కీలక సమావేశం జరిగింది. డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్స్, ఎగ్జిబిటర్లు, నిర్మాతలు ఈ భేటీలో పాల్గొన్నారు. ఈ సమావేశానికి ప్రముఖ నిర్మాతలు దామోదర్ ప్రసాద్, మైత్రీ రవి, సి. కల్యాణ్, ఛాంబర్ సెక్రెటరీ అశోక్ కుమార్, ఎగ్జిబిటర్లు విజయేందర్ రెడ్డి, బాలగోవింద్ తదితరులు హాజరై తమ వాదనలను వినిపించారు.

వివాదం ఏమిటి?

ప్రస్తుతం మల్టీప్లెక్స్‌లలో ఉన్నట్లుగానే, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో కూడా టికెట్ ఆదాయంలో వాటాను (Percentage System) పంచుకోవాలని హైదరాబాద్‌లోని 23 ప్రధాన థియేటర్ల యజమానులు డిమాండ్ చేస్తున్నారు. దీనిని తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ సమర్థించగా, నిర్మాతల గిల్డ్ మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. థియేటర్లకు ఫిక్స్‌డ్ అద్దె కాకుండా శాతాన్ని ఇవ్వడం వల్ల నిర్మాతలు నష్టపోతారని గిల్డ్ వాదిస్తుంది..

మే 1 డెడ్‌లైన్!

ఈ వివాదం ఎంత ముదిరిందంటే, ఒకవేళ ఏప్రిల్ 30లోగా పర్సంటేజీ విధానంపై స్పష్టమైన సానుకూల నిర్ణయం రాకపోతే, మే 1 నుంచి తెలంగాణలోని సింగిల్ స్క్రీన్ థియేటర్లను మూసివేస్తామనిఎగ్జిబిటర్ల సంఘం ఇప్పటికే  హెచ్చరించింది. వేసవి సెలవుల సీజన్ కావడంతో, పెద్ద సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్న తరుణంలో ఈ బంద్ హెచ్చరిక టాలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలోనే  ఫిల్మ్ ఛాంబర్ లో కీలక సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది. అయితే ఈ భేటీలో పర్సంటేజీ వివాదం ఇంకా ఓ కొలిక్కి వచ్చినట్లు లేదని సమాచారం.

►ALSO READ | Yetta Yetta Song: ‘లెనిన్’ సెకండ్ సింగిల్ రిలీజ్.. క్యూట్ స్టెప్పులతో ఆకట్టుకున్న అఖిల్–భాగ్యశ్రీ

త్వరలో తుది నిర్ణయం

సమావేశం అనంతరం ఛాంబర్ సెక్రెటరీ అశోక్ కుమార్ మాట్లాడుతూ.. ప్రస్తుతానికి అందరి అభిప్రాయాలను సేకరించాం. నిర్మాతలు, ఎగ్జిబిటర్ల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఒక మధ్యేమార్గం కోసం ప్రయత్నిస్తున్నాం. త్వరలోనే అధికారిక లేఖ ద్వారా తుది నిర్ణయాన్ని వెల్లడిస్తాం అని తెలిపారు. వేసవి వినోదానికి థియేటర్ల బంద్ అడ్డంకిగా మారుతుందా? లేక నిర్మాతలు-ఎగ్జిబిటర్లు రాజీకి వస్తారా? అనేది ఇప్పుడు తెలుగు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.