బుధవారం భారీ నష్టాల్లో క్లోజ్ అయిన దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం అదే తీరును కొనసాగించాయి. ప్రధానంగా క్రూడ్ ఆయిల్ రేటు మళ్లీ బ్యారెల్ 100 డాలర్లకు పైకి చేరుకోవటంతో మార్కెట్లు షాక్ కి గురయ్యాయి. దీనికి తోడు మార్కెట్లలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్లను దెబ్బతీస్తున్న మరిన్ని కారణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
గురువారం ట్రేడింగ్ ప్రారంభంలోనే దేశీయ సూచీలు భారీ నష్టాలతో ట్రేడ్ అయ్యాయి. ఉదయం 9.50 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 757 పాయింట్లు నష్టపోగా ప్రారంభమైన 15 నిమిషాల్లోనే 950 పాయింట్లు దిగజారటంతో ఇన్వెస్టర్ల సంపద దాదాపు రూ.5 లక్షల కోట్లు ఆవిరైంది. ఇక నిఫ్టీ సూచీ 242 పాయింట్లు, నిఫ్టీ బ్యాంక్ సూచీ 747 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 797 పాయింట్ల మేర పతనం అయ్యి ఇంట్రాడేలో కొనసాగుతున్నాయి.
ముడిచమురు సెగ:
అంతర్జాతీయ ఇంధన సంస్థ చరిత్రలోనే అతిపెద్ద అత్యవసర క్రూడ్ నిల్వలను విడుదల చేస్తున్నట్లు ప్రకటించినప్పటికీ.. మార్కెట్‌లో ఆందోళనలు తగ్గలేదు. బ్రెంట్ క్రూడ్ ధర సుమారు 9 శాతం పెరిగి బ్యారెల్‌కు 100 డాలర్ల వద్దకు చేరగా.. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ కూడా 9 శాతం పెరిగి 95 డాలర్ల వద్దకు చేరింది. హార్ముజ్ జలసంధి గుండా సరఫరా నిలిచిపోతే ప్రపంచ క్రూడ్ అవసరాల్లో దాదాపు ఐదింట ఒక వంతు ప్రభావితమవుతుందనే భయం వ్యాపారులను వెంటాడుతోంది. ఐఈఏ సభ్య దేశాలు 400 మిలియన్ బారెళ్ల క్రూడ్‌ను విడుదల చేసినా.. ఇది సరఫరా లోటును కేవలం పావు వంతు మాత్రమే భర్తీ చేయగలదని తెలుస్తోంది.
బ్యాంకింగ్, ఆటో రంగాల్లో అమ్మకాల ఒత్తిడి..
దేశీయ మార్కెట్లో ప్రధానంగా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ స్టాక్స్ కుప్పకూలాయి. నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ 1.7 శాతం మేర క్షీణించి 54,786 స్థాయికి పడిపోయింది. ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు భారీగా నష్టపోయాయి. వీటితో పాటు నిఫ్టీ ఆటో ఇండెక్స్ 2 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ 2 శాతం మేర పతనమయ్యాయి. టాటా స్టీల్, ఎల్‌అండ్‌టీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ వంటి దిగ్గజ సంస్థల షేర్లు కూడా 1.5 నుంచి 3 శాతం మధ్య నష్టాలను చవిచూశాయి.
పెరిగిన ఎఫ్ఐఐల అమ్మకాలు..
మార్కెట్లో భయాందోళనలను సూచించే India VIX దాదాపు 5 శాతం పెరిగి 22.07 వద్దకు చేరింది. ఇది ఇన్వెస్టర్లలో ఉన్న గందరగోళాన్ని సూచిస్తోంది. మరోవైపు విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు వరుసగా 9వ ట్రేడింగ్ సెషన్‌లోనూ అమ్మకాలను కొనసాగించారు. గత సెషన్‌లో వారు రూ.6వేల 267 కోట్ల విలువైన షేర్లను విక్రయించగా.. దేశీయ ఇన్వెస్టర్లు రూ.4వేల 965 కోట్ల కొనుగోళ్లతో మార్కెట్‌ను ఆదుకునే ప్రయత్నం చేశారు.
మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. నిఫ్టీ 24,000 స్థాయి కంటే దిగువన ఉన్నంత కాలం సెంటిమెంట్ బలహీనంగానే ఉంటుంది. ఒకవేళ పతనం కొనసాగితే 23,700 నుంచి 23,550 స్థాయిలను నిఫ్టీ మళ్లీ పరీక్షించే అవకాశం ఉంది. యుద్ధ వాతావరణం సద్దుమణిగి క్రూడ్ ధరలు స్థిరపడే వరకు మార్కెట్లో ఒడిదుడుకులు తప్పవని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
