17న ఆదివాసీ,బంజారా భవనాలను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్

17న  ఆదివాసీ,బంజారా భవనాలను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్

ఈ నెల 17వ తేదీన ఆదివాసీ, బంజారా భవనాలను సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారని సీఎస్ సోమేష్ కుమార్ వెల్లడించారు. ఆ తర్వాత నెక్లెస్ రోడ్ నుంచి గుస్సాడీ, గోండు, లంబాడ తదితర కళకారులతో భారీ ర్యాలీ ఉంటుందన్నారు. ర్యాలీ అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగిస్తారని తెలిపారు. ఈ నెల 16, 17 ,18 తేదీల్లో జాతీయ సమైక్యతా ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించిన నేపథ్యంలో ఈ ఉత్సవాల ఏర్పాట్లపై సీఎస్ సోమేష్ కుమార్ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. 
 
అన్ని వర్గాల ప్రజలచే ర్యాలీ..

సెప్టెంబర్ 16 , 17 ,18 తేదీల్లో హైదరాబాద్ తో పాటు అన్ని నియోజకవర్గాలు, జిల్లా కేంద్రాల్లో జాతీయ సమైక్యతా ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేపట్టాలని సంబంధిత శాఖల అధికారులను సిఎస్ సోమేష్ కుమార్ ఆదేశించారు. జాతీయ సమైక్యతా ఉత్సవాల్లో భాగంగా సెప్టెంబర్ 16న రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ  నియోజకవర్గాల్లో విద్యార్థులు, యువత, మహిళలచే ర్యాలీలు నిర్వహించాలని అధికారులను సీఎస్ సోమేష్ కుమార్ ఆదేశించారు. సెప్టెంబర్ 18న అన్ని జిల్లా కేంద్రాల్లోనూ ర్యాలీ చేపట్టాలని సూచించారు.