పల్లె, పట్టణ ప్రగతిపై సీఎస్ సోమేశ్ కుమార్ సమీక్ష సమావేశం

పల్లె, పట్టణ ప్రగతిపై సీఎస్ సోమేశ్ కుమార్ సమీక్ష సమావేశం

హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్లు, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖ సీనియర్ అధికారులతో పల్లె, పట్టణ ప్రగతి పై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన చట్టాలను గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలలో అంకిత భావంతో అమలు చేయలన్నారు. ఈ చట్టాల అమలు కోసం అడిషనల్ కలెక్టర్ పోస్టులను మంజూరు చేశామని తెలిపారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ విజన్ ను గుర్తు చేస్తూ ప్రతి గ్రామపంచాయతీ, మున్సిపాలిటీలను శుభ్రంగా, పచ్చద‌నంగా ఉంచాలన్నారు. గ్రామపంచాయతీలు, పట్టణ స్థానిక సంస్థలకు ప్రతి నెల రెగ్యులర్ గా రూ.456 కోట్లను విడుదల తో పాటు ట్రాక్టర్లు, ట్యాంకర్లు ఇవ్వడంతో ఎటువంటి సమస్యలు లేవన్నారు. అడిషనల్ కలెక్టర్లు గ్రామపంచాయతీలు, పట్టణ స్థానిక సంస్థలను తనిఖీ చేసి ప్రతి రోజు రోడ్లు, డ్రైనేజీ ల‌ను పరిశుభ్రంగా ఉంచేలా చూడాలని ఆదేశించారు. విధులలో నిర్లక్ష్యం వహించిన వారిపై తగు చర్యలు ఉంటాయన్నారు. స్థానిక సంస్థలలో వైకుంఠధామాలు, సెగ్రిగేషన్ మరియు డంపింగ్ షెడ్స్, సమీకృత వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ మార్కెట్లు లాంటి నిర్మాణ కార్యక్రమాలు చేపట్టినందున వీటిని మార్చి, 2021 లోగా పూర్తి చేసి వినియోగంలోకి తేవాలని సీఎస్ కోరారు.

పచ్చదనం కోసం చేపట్టిన పల్లె ప్రకృతి వనం తరహాలో ట్రీ పార్క్స్, మల్టీ లెవల్ ఎవెన్యూ ప్లాంటేషన్ చేపట్టి పూర్తి చేయాలన్నారు. నూతన చట్టం ప్రకారం బడ్జెట్ లో 10 శాతాన్ని గ్రీన్ బడ్జెట్ గా వినియోగించాలన్నారు. దెబ్బతిన్న మొక్కలను వెంటనే రీప్లేస్ చేయాలన్నారు. వేసవి సీజన్ లో మొక్కలు బతికేలా గ్రామ పంచాయతీలలో ఉన్న ట్రాక్టర్లు, ట్యాంకర్ల ద్వారా ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో పారదర్శకంగా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా భవన నిర్మాణ అనుమతులు జారీ చేయడం కోసం టీఎస్ బిపాస్ ను అమలులోకి తీసుకోవచ్చామన్నారు. భవన నిర్మాణ అనుమతులు వేగంగా జారీ తో పాటు ఎటువంటి ఆక్రమణలు లేకుండా చూడాలని అడిషనల్ కలెక్టర్లకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు.