మళ్లీ పడిపోయిన.. పప్పులు, నూనె గింజల సాగు

మళ్లీ పడిపోయిన.. పప్పులు, నూనె గింజల సాగు
  • మొదటి రెండు స్థానాల్లో వరి, పత్తి
  • అర్థగణాంకశాఖ నివేదికలో వెల్లడి
  • కోతులు, మార్కెటింగ్​సమస్యే కారణం
  • పంట మార్పిడికి రైతులను ప్రోత్సహించాలని సూచన

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పప్పు ధాన్యాలు, నూనె గింజల పంట సాగు మరోసారి పడిపోయింది. ఎప్పట్లాగే వరి, పత్తి పంటలు మొదటి రెండు స్థానాల్లో నిలిచాయి. 2025–-26లో పంటల సాగు, దిగుబడికి సంబంధించిన సెకండ్ అడ్వాన్స్ ఎస్టిమేట్స్‌ను ‘డైరెక్టర్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ డిపార్ట్‌మెంట్’ తాజాగా నివేదిక విడుదల చేసింది. కోతులు బెడద, మార్కెటింగ్ సమస్యలే ఈ తగ్గుదలకు ప్రధాన కారణమని రిపోర్ట్ స్పష్టం చేసింది. గతేడాది ఖరీఫ్, యాసంగి సీజన్లలో కలిపి 280.77 లక్షల టన్నులకు పైగా ధాన్యం దిగుబడి వచ్చినప్పటికీ, పప్పులు, నూనె గింజల సాగు తగ్గడం ఆందోళన కలిగిస్తోంది. 

ఈ విభాగం  ఏటా నాలుగుసార్లు పంటల సాగు, దిగుబడి అంచనాల నివేదికలు పంపుతుంది. తాజాగా రెండో ముందస్తు అంచనా విడుదల చేయడం విశేషం. కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ కొత్త నిబంధనల ప్రకారం, వానాకాలం పంటల్లో వరి, మక్క, జొన్న, పెసర్లు, మినుములు, వేరుశనగ, సోయా పంటల అంచనాలు మూడేళ్ల సరాసరి దిగుబడులను డిపార్ట్​మెంట్​పరిగణనలోకి తీసుకుంది. క్షేత్రస్థాయి పంటకోత ప్రయోగాల ద్వారా ఈ అంచనా వేసినట్లు అధికార యంత్రాంగం వెల్లడించింది.

మొదటి రెండు స్థానాల్లో వరి, పత్తి.. 
స్టాటిస్టిక్స్ డిపార్ట్‌మెంట్ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. 2025-–26లో వరి సాగు 53.42 లక్షల హెక్టార్లకు చేరింది. గతేడాది 2024–-25లో ఇది 47.80 లక్షల హెక్టార్లుగా ఉంది. గతేడాదితో పోలిస్తే ఈసారి 11.76 శాతం పెరిగింది. పత్తి 20.52 లక్షల హెక్టార్లలో సాగవగా, గతేడాది 18.18 లక్షల హెక్టార్లతో పోలిస్తే ఈసారి 12.87 శాతం వృద్ధి నమోదైంది. ఇక జొన్న సాగు 1.59 లక్షల హెక్టార్లకు, మొక్కజొన్న 7.17 లక్షల హెక్టార్లకు చేరింది. ఇవి గతేడాదితో పోలిస్తే వరుసగా ఈసారి 45.87 శాతం, 46.33 శాతం పెరిగాయి.

పడిపోయిన పప్పులు, నూనె గింజలు..
అర్థగణాంకశాఖ నివేదికలో పప్పు ధాన్యాల సాగులో తగ్గుదల స్పష్టంగా కనిపిస్తోంది. కంది సాగు 1.77 లక్షల హెక్టార్లకు పరిమితమైంది. గతేడాది 1.79 లక్షల హెక్టార్లతో పోలిస్తే ఈసారి1.12 శాతం తగ్గింది. పెసర్లు 24 వేల హెక్టార్లకు, సోయాబీన్ 1.54 లక్షల హెక్టార్లకు తగ్గాయి. గతేడాదితో పోలిస్తే వరుసగా 14.25 శాతం, 15.38 శాతం పడిపోయాయి. నూనె గింజల పంటల్లో కూడా ఇదే పరిస్థితి. వేరుశనగ సాగు గతేడాదితో పోలిస్తే స్వల్పంగా పెరిగినప్పటికీ, మొత్తం నూనె గింజల సాగు తగ్గుదలను చూపుతోంది.

పంటల దిగుబడిపైనా ప్రభావం..
దిగుబడి అంచనాల విషయానికి వస్తే, గతేడాది మొత్తం 236.87 లక్షల టన్నుల ఆహార ధాన్యాలు (బియ్యం, పప్పులు, తృణధాన్యాలు) దిగుబడి వచ్చింది. 2025-–26లో తృణధాన్యాలు, చిరుధాన్యాలు కలిపి 46.16 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా ఉంది. కంది పంట దిగుబడి 1.54 లక్షల టన్నులకు (గతేడాది 1.99 లక్షల టన్నులు) తగ్గింది. అంటే 22.61 శాతం తగ్గుదల నమోదైంది. 

పెసర్లు 16 వేల టన్నులకు (గతేడాది 24 వేల టన్నులు) తగ్గి 33.33 శాతం తగ్గుముఖం పట్టాయి. కాగా, మినుములు 52 వేల టన్నులకు పెరిగి 20.93 శాతం వృద్ధి చూపాయి. మొక్కజొన్న, మినుములు, వేరుశనగ, పత్తి పంటల దిగుబడి మాత్రమే గతేడాదితో పోలిస్తే ఈసారి పెరిగినట్లు నివేదిక పేర్కొంది. వేరుశనగ 2.49 లక్షల టన్నులకు (13.18 శాతం పెరుగుదల), సోయాబీన్ 60.84 లక్షల టన్నులకు (4.97 శాతం పెరుగుదల) చేరాయి.

పంటమార్పిడి​ చేయాలని సూచన.. 
2025-–26 సంవత్సరంలో ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్​లో అధిక వర్షపాతం నమోదైంది. దీంతో ఆహార ధాన్యాల దిగుబడి గతేడాదితో పోలిస్తే ఈసారి 4.88 శాతం పెరిగినట్లు రిపోర్ట్​వెల్లడించింది. వరి 3.92 శాతం, పత్తి పంట సాగు 13.22 శాతం పెరిగినప్పటికీ, పప్పు ధాన్యాల సాగు తగ్గడం ఆహార భద్రతపై ప్రభావం చూపవచ్చని హెచ్చరించింది. 

అందువల్ల వరి, పత్తి పంటల నుంచి పప్పు ధాన్యాల సాగు వైపునకు రైతులను మళ్లించాలని సలహా ఇచ్చింది. పప్పులు, నూనె గింజల సాగు తగ్గడానికి మార్కెటింగ్ సమస్యలు, కోతుల బెడదే ప్రధాన కారణమని, అందుకే రైతులు ఈ పంటలపై ఆసక్తి చూపడం లేదని పేర్కొంది. పప్పు ధాన్యాలు, నూనె గింజలకు మద్దతు ధరలు పెంచి, మార్కెటింగ్ సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని అర్థగణాంకశాఖ నివేదిక గుర్తుచేసింది.