- ఈ నెల 11న రికార్డు స్థాయిలో 14,649 మెగావాట్ల డిమాండ్ నమోదు
- రోజుకు 284 మిలియన్ యూనిట్ల వాడకం.. జెన్ కో ఉత్పత్తి 89 మి. యూనిట్లే
- మిగతాదంతా బయటనే కొనుగోలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కరెంట్ వినియోగం భారీగా పెరిగింది. యాసంగి సాగు పెరగడంతో పాటు ఎండలు మొదలుకావడంతో డిమాండ్ పెరిగింది. ఈ నెల 11న రికార్డు స్థాయిలో 14,649 మెగావాట్ల పీక్ డిమాండ్ నమోదైంది. గత నెల రోజులుగా కరెంట్ డిమాండ్ రోజూ 14 వేల మెగావాట్ లకు పైనే ఉంటోంది. తాజాగా బుధవారం 14,457 మెగావాట్‌ల డిమాండ్ నమోదైంది. పోయినేడు యాసంగితో పోలిస్తే ఈసారి వరి సాగు లక్షలాది ఎకరాల్లో పెరిగింది. మరోవైపు ఎండలు ఇప్పుడే దంచి కొడుతుండడంతో ఏసీలు, ఫ్యాన్లు, కూలర్ల వినియోగం పెరిగింది. దీంతోనే విద్యుత్ డిమాండ్ ఎక్కువైంది.
ఫిబ్రవరిలోనే ఇట్లుంటే.. మార్చి, ఏప్రిల్ లో ఎండలు ఎక్కువవుతాయని, అప్పుడు డిమాండ్ మరింత పెరుగుతుందని ఎక్స్ పర్ట్స్ అంటున్నారు. మార్చి నాటికి రోజువారీ డిమాండ్ 15 వేల మెగావాట్లు దాటిపోయే అవకాశం ఉందని చెబుతున్నారు.
పెరిగిన వ్యవసాయ కనెక్షన్లు..
రాష్ట్రం ఏర్పడే నాటికి 19.02 లక్షల వ్యవసాయ కరెంట్ కనెక్షన్లు ఉంటే.. ఇప్పుడు 26 లక్షలకు పైగా పెరిగాయి. గత నాలుగేండ్లుగా మంచి వర్షాలు పడి బావులు, చెరువుల్లో నీళ్లు ఉండడంతో పంటల సాగు పెరిగి కరెంట్ వినియోగం పెరుగుతూ వస్తోంది. ఈ యాసంగిలో ఇప్పటికే దాదాపు 53.08 లక్షల ఎకరాల్లో వరి నాట్లు వేశారు. నిరుటితో పోలిస్తే ఈసారి 8 లక్షల ఎకరాలు ఎక్కువ సాగైంది. రైతులు కాలువలపై ఆధారపడకుండా బోర్ల ద్వారానే పంటలకు నీళ్లు అందిస్తున్నారు. దీంతో కరెంట్ డిమాండ్ రోజురోజుకు పెరుగుతోంది.
త్రీఫేజ్ సరఫరా చేయలేక చేతులెత్తేస్తున్న డిస్కమ్‌లు..
డిమాండ్‌కు తగ్గట్టు త్రీఫేజ్ కరెంట్ సరఫరా చేయలేక డిస్కమ్‌లు చేతులెత్తేస్తున్నాయి. యాసంగి సాగు పెరగడంతో రోజువారీ కరెంట్ వినియోగం 280 మిలియన్ యూనిట్లకు పైగానే ఉంటోంది. కానీ రోజువారీగా జెన్‌కో ఉత్పత్తి చేస్తున్నది 85 మిలియన్ యూనిట్లలోపే. మరో 156 మిలియన్ యూనిట్లు సెంట్రల్ జనరేటింగ్ స్టేషన్ల నుంచి కొనుగోలు చేస్తుండగా, ఇంకో 36 మిలియన్ యూనిట్ల వరకు నేషనల్ కరెంట్ ఎక్స్ఛేంజీల నుంచి కొంటోంది. ఇందుకోసం రూ.వందల కోట్లు ఖర్చు చేయాల్సి వస్తోంది. అయినప్పటికీ డిమాండ్‌కు తగ్గట్టు సరఫరా చేయలేక డిస్కమ్‌లు త్రీఫేజ్ కరెంటుకు కోతలు విధిస్తున్నాయి.
