ఎయిర్ పోర్టులో 2 కిలోలకు పైగా గోల్డ్ సీజ్

ఎయిర్ పోర్టులో 2 కిలోలకు పైగా గోల్డ్ సీజ్
  • ముగ్గురిని అదుపులోకి తీసుకున్న కస్టమ్స్ అధికారులు
  • మరో ముగ్గురి నుంచి ఫారిన్ సిగరెట్లు స్వాధీనం

శంషాబాద్, వెలుగు: బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న ముగ్గురు ప్యాసింజర్లను  శంషాబాద్ ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. యూఏఈలోని రాస్ అల్ ఖైమా ప్రాంతం నుంచి బుధవారం శంషాబాద్ ఎయిర్​పోర్టుకు చేరుకున్న ఓ ప్యాసింజర్ నుంచి కిలో 196 గ్రాములు, కువైట్ నుంచి శంషాబాద్ కు వచ్చిన ప్యాసింజర్ నుంచి 752 గ్రాములు, షార్జా నుంచి వచ్చిన మరో ప్యాసింజర్ నుంచి 221 గ్రాముల బంగారాన్ని సీజ్ చేశారు. ముగ్గురి నుంచి మొత్తం 2 కిలోల 279 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. 

వీటి విలువ సుమారు రూ.కోటి 37 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. మరోవైపు కంబోడియా నుంచి బ్యాంకాక్ మీదుగా శంషాబాద్ ఎయిర్​పోర్టుకు చేరుకున్న మరో ముగ్గురు ప్యాసింజర్ల నుంచి లక్ష ఫారిన్ సిగరెట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బంగారం, ఫారిన్  సిగరెట్లను తరలించిన ఆరుగురిపై కస్టమ్స్ యాక్ట్ కింద కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టారు.