Cricket World Cup 2023: నోటికొచ్చింది వాగడానికి సిగ్గుండాలి.. పాక్ క్రికెటర్‌ను ఏకిపారేసిన షమీ

Cricket World Cup 2023: నోటికొచ్చింది వాగడానికి సిగ్గుండాలి.. పాక్ క్రికెటర్‌ను ఏకిపారేసిన షమీ

కొన్నిరోజుల క్రితం భారత బౌలర్లను ఉద్దేశిస్తూ పాక్ మాజీ క్రికెటర్ హసన్ రాజా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు అందరికీ గుర్తుండే ఉంటాయి. వాంఖడే వేదికగా భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో లంకేయులు 55 పరుగులకే కుప్పకూలాగానే మీడియా ముందుకొచ్చిన ఈ మేధావి.. ఐసీసీ, బీసీసీఐ, భారత బౌలర్లు కలిసి కుట్రపన్నుతున్నారంటూ నోటికొచ్చింది వాగాడు. 

భారత్ - శ్రీలంక మ్యాచ్ విశ్లేషణపై పాకిస్తాన్‌కు చెందిన ఓ టీవీ ఛానెల్‌ చర్చలో పాల్గొన్న హసన్‌ రాజా.." భారత జట్టు బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో బంతి నార్మల్‌గానే ఉంటుంది. వారు ఎప్పుడైతే బౌలింగ్‌కు వస్తారో బంతి ఆటోమేటిక్‌గా సీమర్స్‌కు అనుకూలిస్తోంది. అంతేకాదు, గతంలో ఎన్నడూ చూడని విధంగా విపరీతంగా స్వింగ్‌ అవుతోంది. అలాగే, కొన్ని సందర్భాల్లో డీఆర్‌ఎస్‌ నిర్ణయాలు వారికే అనుకూలిస్తున్నాయి. బంతి ఎటుపడినా వికెట్లను తాకుతోంది. ఇతర జట్ల బౌలర్లకు మాత్రం అది సాధ్యపడట్లేదు. నాకెందుకో ఇది నమ్మశ్యకంగా అనిపించడం లేదు. ఐసీసీ, బీసీసీఐ కలిసి భారత బౌలర్లకు ప్రత్యేకమైన బంతులు అందజేస్తున్నాయి అనిపిస్తోంది. దీనిపై దర్యాప్తు జరిపించాలి.." అని మాట్లాడాడు.

చివరకు ఈ వ్యాఖ్యలు భారత పేసర్ మహమ్మద్ షమీ దృష్టికి రాగా, అతను హసన్‌ రాజాను ఏకిపారేశాడు. "ఇతరుల విజయాలను చూసి ఓర్వలేనందుకు సిగ్గుపడండి. ఇకనైనా పనికిమాలిన మాటలు మాని ఆటపై దృష్టి పెట్టండి. ఇది ఐసీసీ ప్రపంచ కప్. పాకిస్తాన్‌లో ఆడే లోకల్ టోర్నీ వంటిది కాదు. వసీమ్ భాయ్ అప్పటికీ చెప్తూనే ఉన్నారు. కనీసం మీ ఆటగాడినైనా నమ్మండి.." అని షమీ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేశారు.

అగ్రస్థానంలో షమీ

ఈ మెగా టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్లలో షమీ అగ్రస్థానంలో ఉన్నారు. 4 మ్యాచ్ ల్లో16 వికెట్లు తీశాడు. ఇక బుమ్రా 8 మ్యాచ్ ల్లో15 వికెట్లు తీయగా.. రవీంద్ర జడేజా14, సిరాజ్10 వికెట్లు తీశారు.