సైబర్ నేరగాళ్లు వాట్సాప్ గ్రూపుల్లోకి ఏపీకే ఫైళ్ల రూపంలో మాల్‌వేర్‌ను పంపిస్తున్నారు. ఏపీకే ఫైల్స్‌ను క్లిక్ చేసి ఇన్‌స్టాల్ చేసుకున్న వారి మొబైల్ ఫోన్లను హ్యాక్ చేస్తున్నారు. హ్యాక్ చేసిన మొబైల్స్‌లోని వాట్సాప్ గ్రూపులను టార్గెట్ చేస్తున్నారు. వాట్సాప్ గ్రూపుల్లోని కాంటాక్ట్స్ అన్నింటికి బల్క్ ఏపీకే ఫైల్స్ లింకులు పంపిస్తున్నారు. హ్యాక్ చేసిన మొబైల్ నంబర్‌తో ఉన్న ఇతర వాట్సాప్ గ్రూప్‌లలోకి వెళ్లి ఆ గ్రూప్ అడ్మిన్ సెట్టింగ్స్ మార్చడం.. అదే వాట్సాప్ నంబర్ నుంచి ఇతరులకు మెసేజ్‌ల రూపంలో మరికొన్ని ఏపీకే ఫైల్స్ పంపడం ద్వారా మొబైల్ ఫోన్లను హ్యాకింగ్ చేస్తున్నారు. ఇలా మొబైల్ ఫోన్‌ను తమ అధీనంలోకి తీసుకుని బ్యాంక్ అకౌంట్లను ఖాళీ చేస్తున్నారు.
అనుమానం వస్తే ఇలా చేయాలి..
సోషల్ మీడియాలో వచ్చే ఏపీకే ఫైల్(.apk) లింకులను ఎట్టి పరిస్థితిలోను క్లిక్ చేయొద్దు. వాట్సాప్‌లో టూ-స్టెప్ వెరిఫికేషన్ తప్పనిసరిగా పెట్టుకోవాలి. దీనివల్ల సీక్రెట్ కోడ్ ఎంట్రీ చేస్తే తప్ప వాట్సాప్ ఓపెన్ కాదు. అనుమానం వస్తే వాట్సాప్‌ను అన్ ఇన్‌స్టాల్ చేయాలి. మళ్లీ ఇన్‌స్టాల్ చేసి, మీ నంబర్‌తో వెరిఫై చేసుకోవాలి. సెట్టింగ్స్‌లోకి వెళ్లి కాల్ ఫార్వర్డింగ్‌ను డిజేబుల్ చేయండి. ఫోన్ ఓవర్ హీటింగ్, బ్యాటరీ త్వరగా డిశ్చార్జ్ అయితే మొబైల్ హ్యాక్ అయినట్లు భావించాలి. గూగుల్ స్టోర్‌లో మాత్రమే యాప్స్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. వీటిలోనూ కొన్ని స్కామర్లు సృష్టించినవి ఉంటాయి. స్మార్ట్ ఫోన్‌లోని సెట్టింగ్‌లో ఇన్‌స్టాల్ ఫ్రం అన్‌నోన్ సోర్సెస్ అనే ఆప్షన్‌ను డిజేబుల్ చేసుకోవాలి. దీంతో మన అనుమతి లేకుండా యాప్స్ ఇన్‌స్టాల్ కావు. ఏపీకే ఫైల్, మాల్‌వేర్ ఇన్‌స్టాల్ జరిగినట్లు అనుమానం వస్తే మొబైల్ రీసెట్ చేయాలి. ఆ వెంటనే బ్యాంక్ అకౌంట్‌కు సంబంధించిన పిన్ నంబర్లు, పాస్‌వర్డ్స్ మార్చుకోవాలి.
