
- ముందు పాప్ అప్స్, లింక్స్ పంపుతరు
- అవి క్లిక్ చేస్తే పోర్న్‌సైట్స్ ఓపెన్
- ఇల్లీగల్ యాక్టివిటీలు చేస్తున్నారంటూ తర్వాత బ్లాక్‌మెయిల్
‘‘సికింద్రాబాద్‌కి చెందిన సందీప్ ఓ ఐటీ కంపెనీలో పనిచేస్తున్నాడు. లాక్‌డౌన్‌లో వర్క్‌ఫ్రమ్ హోమ్ చేసే సమయంలో కంప్యూటర్ స్క్రీన్‌పై ఓ రాష్ట్రానికి చెందిన పోలీస్ లోగోతో పాప్‌అప్ వచ్చింది. క్లిక్ చేసిన వెంటనే వైరస్ అటాక్ అయినట్లు గుర్తించాడు. ఆ లింక్స్‌ను సిస్టమ్ నుంచి రిమూవ్ చేశాడు. ఎంప్లాయిస్‌ను అలర్ట్ చేసి సైబర్ క్రైమ్ పోర్టల్‌లో రిపోర్ట్ చేశాడు.’’
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌కు చెందిన మహేశ్‌కి మొన్న ఆన్‌లైన్‌లో ఒక పాప్‌ఆప్ వచ్చింది. ‘‘మీరు పోర్న్ సైట్స్ చూస్తున్నారు.. అందుకే మీ కంప్యూటర్‌ను బ్లాక్ చేస్తున్నాం. ముంబైలో కేసు రిజిస్టర్ అయ్యింది. త్వరలోనే అరెస్ట్ చేస్తాం’’ అని బెదిరించారు. కేసులు, అరెస్టులు లేకుండా ఉండాలంటే పోర్న్ చూసినందుకు ఫైన్ కట్టాలని చెప్పి రూ.1.5 లక్షలు వసూలు చేశారు... సైబర్ నేరగాళ్ల కొత్త పంథాకు ఉదాహరణ ఇది. ఏకంగా పోలీసు లోగోలనే వాడుకుంటూ మోసాలకు పాల్పడుతున్నారు. పాప్‌అప్స్, లింక్స్ పంపి, పోర్న్ సైట్స్ చూస్తున్నారని బెదిరించి.. అందిన కాడికి దోచేస్తున్నారు. ఇటీవల ఇలాంటి సైబర్ నేరాలు పెరిగిపోవడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు.
కొత్త వైరస్ డెవలప్ చేసి..
సైబర్ నేరగాళ్లు నయా నేరాలు మొదలుపెట్టారు. కొత్త వైరస్ డెవలప్ చేసుకుని.. దేశ, విదేశాల పోలీస్ లోగోలతో పాప్ అప్స్ క్రియేట్ చేసి.. రెండూ కలిపి సోషల్ మీడియా, మెయిల్స్ ద్వారా లింక్స్ పంపిస్తున్నారు. పొరపాటున వాటిని క్లిక్ చేసిన వారికి పోర్న్‌సైట్స్ ఓపెన్ అవుతున్నాయి. వెంటనే కంప్యూటర్ లేదా స్మార్ట్‌ఫోన్స్‌లోకి వైరస్ ఎంటర్ అవుతున్నది. ఇలా లింక్స్ క్లిక్ చేసిన వారిని టార్గెట్ చేస్తున్నారు. మెయిల్ ఐడీ, ఐపీ అడ్రస్, ఫోన్ నంబర్లు హ్యాక్ చేస్తున్నారు. పోర్న్ సైట్స్ చూస్తున్నారని, నిషేధిత గేమ్స్ ఆడుతున్నారంటూ మెయిల్స్, మెసేజెస్ చేస్తున్నారు. ఇల్లీగల్ యాక్టివిటీస్‌కి పాల్పడుతున్నందుకు కంప్యూటర్లు బ్లాక్ చేస్తున్నామని, లొకేషన్ ట్రేస్ చేశామని, తమ దగ్గర ఉన్న వీడియోలు, టెక్నికల్ డేటాతో ఎక్కడున్నా అరెస్ట్ చేస్తామని బెదిరిస్తున్నారు. కేసుల నుంచి తప్పించుకోవాలంటే తాము అడిగినంత డబ్బు ఇవ్వాలని బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు. పోర్న్ చూసినందుకు ఫైన్ కట్టాలని డబ్బులు డిపాజిట్ చేయించుకుంటున్నారు.
పరువుపోతుందనే భయంతో..
ఇలాంటి ఘటనల బాధితుల్లో చాలా మంది పోలీసులకు ఫిర్యాదు చేయడం లేదు. వేధింపులు భరించలేని కొద్ది మంది మాత్రమే పోలీసులను ఆశ్రయిస్తున్నారు. తమ పేర్లు బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో ఇప్పటికే పదుల సంఖ్యలో కేసులు రిజిస్టర్ అయ్యాయి. ఆయా కేసులను పోలీసులు పరిశీలిస్తున్నారు. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్‌పైనే ఇలాంటి నేరాలు ఎక్కువగా జరుగుతున్నట్లు గుర్తించారు. రాష్ట్రంలో ఎవరైనా బ్లాక్‌మెయిలింగ్‌కి గురైతే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు.
మాకూ పాప్‌అప్స్ వచ్చినయ్
‘‘ఓ అమ్మాయి ఫొటోలను పోర్న్‌సైట్‌లో గుర్తు తెలియని వ్యక్తులు అప్‌లోడ్ చేశారు. బాధితురాలు మాకు ఫిర్యాదు చేసింది. ఫొటోలను డెలిట్ చేసేందుకు లింక్ ఓపెన్ చేశాం. వెంటనే మా సిస్టమ్‌లో అలర్ట్స్ వచ్చాయి. వైరస్ అటాక్ అయిందని, యాంటీ వైరస్ ఇన్‌స్టాల్ చేయాలని పాప్‌అప్స్ వచ్చాయి. ఇలాంటివి పోర్న్‌సైట్స్‌లో చాలానే ఉంటాయి. గుర్తు తెలియని లింక్స్, పాప్‌అప్స్ క్లిక్ చేయవద్దు. పోలీస్ లోగోలతో పాప్‌అప్స్ పంపుతున్నట్లుగా మాకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదు’’
‑ కేవీఎం ప్రసాద్, ఏసీపీ, సైబర్ క్రైమ్స్, హైదరాబాద్