ఫేక్​‘మీ షో’ వెబ్​సైట్​తో ఫ్రాడ్..స్టూడెంట్ నుంచి రూ. 1.09 లక్షలు కొట్టేసిన సైబర్​ నేరగాళ్లు

ఫేక్​‘మీ షో’ వెబ్​సైట్​తో ఫ్రాడ్..స్టూడెంట్ నుంచి రూ.  1.09 లక్షలు కొట్టేసిన సైబర్​ నేరగాళ్లు

బషీర్​బాగ్, వెలుగు: ఫేక్​ ఆన్​లైన్​ షాపింగ్​వెబ్​సైట్​తో  సిటీకి చెందిన ఓ యువతిని సైబర్​నేరగాళ్లు చీట్ ​చేశారు. ఇన్​స్టాగ్రామ్ లో సంప్రదించి రూ.1.09 లక్షలు కొట్టేశారు. సిటీకి చెందిన యువతి(19) స్టూడెంట్. కొన్నిరోజుల కింద ఆమెకు ఇన్‌స్టాగ్రామ్ లో ఓ మెసేజ్ వచ్చింది. దానికి ఆమె స్పందించగా, తర్వాత బంగ్లాదేశ్‌కు చెందిన ఫోన్​ నంబర్(+880 1723-155742) నుంచి వాట్సాప్ మెసేజ్ వచ్చింది. 

అందులోని టెలిగ్రామ్ లింక్‌ https://oquubd0.com/login  క్లిక్​ చేసి, అక్కడ ‘మీ షో’ పేరుతో ఉన్న సైట్​లో లాగిన్ అవ్వాలని స్కామర్లు యువతిని నమ్మించారు.  మొదట రూ.వెయ్యి పెట్టుబడికి రూ.228 లాభం చూపించారు. తర్వాత రూ.500 ఇన్వెస్ట్ చేయమని సూచించారు. అలా పలుసార్లు చిన్న చిన్న లాభాలు చూపించారు. నిజమేనని నమ్మిన యువతి వేలల్లో ఇన్వెస్ట్ ​చేయడం మొదలుపెట్టింది. అప్పటి నుంచి ఓ ఫేక్ ​ట్రేడింగ్ యాప్ లో లాభాలు వచ్చినట్లు స్కామర్లు చూపించారు. 

రోజురోజుకు లాభాలు పెరగడంతో యువతి స్నేహితుల వద్ద అప్పు తీసుకుని మరీ రూ.లక్షా9 వేల 404 ఇన్వెస్ట్​ చేసింది. ఆ మొత్తానికి స్కామర్లు ఫేక్ ​యాప్‌లో రూ.1.81 లక్షల లాభం చూపించారు. కానీ లాభం పైసలను విత్​డ్రా చేసుకునేందుకు ఆప్షన్  ఇవ్వలేదు. మరో రూ.58వేలు ఇన్వెస్ట్ ​చేయాలని స్కామర్లు డిమాండ్ చేయడంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించింది. ఆ తర్వాత నుంచి ఎలాంటి స్పందన లేదు. దీంతో బాధితురాలు  సైబర్ క్రైమ్ పోర్టల్ లో  ఫిర్యాదు చేసిందని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హైదరాబాద్​ సైబర్​ క్రైమ్​ ఏసీపీ శివమారుతి తెలిపారు.