సైబర్ నేరగాళ్లకు కరీంనగర్ లో మ్యూల్ అకౌంట్లు..34 ఖాతాలను గుర్తించిన పోలీసులు

సైబర్ నేరగాళ్లకు కరీంనగర్ లో మ్యూల్ అకౌంట్లు..34 ఖాతాలను గుర్తించిన పోలీసులు
  • అక్రమ లావాదేవీలతో రూ.2.91 కోట్లు జమ

కరీంనగర్, వెలుగు: కరీంనగర్ జిల్లాలోని నాలుగు ప్రధాన బ్యాంకుల్లో సైబర్ నేరగాళ్లు ఉపయోగిస్తున్న 34 మ్యూల్ అకౌంట్లను కరీంనగర్ కమిషనరేట్ పోలీసులు గుర్తించారు. రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ విభాగం చేపట్టిన ‘ఆపరేషన్ క్రాక్‌‌డౌన్’లో భాగంగా అనుమానాస్పద ఖాతాలపై నిఘా పెట్టగా ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

పోలీసుల విచారణలో కరీంనగర్‌‌కు చెందిన కొంతమంది యువకులు, చిరువ్యాపారులు ఒక్కో లావాదేవీకి రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు కమీషన్ కోసం తమ బ్యాంకు ఖాతాలను సైబర్ నేరగాళ్లకు అప్పగించినట్లు తెలిసింది.

ఈ ఖాతాల ద్వారా సైబర్ నేరగాళ్లు సుమారు వెయ్యికి పైగా అక్రమ లావాదేవీలు జరిపి రూ.2.91 కోట్ల వరకు డబ్బు జమ చేసినట్లు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు 20 కేసులు నమోదు చేశారు. ఇప్పటికే కరీంనగర్ సైబర్ సెక్యూరిటీ విభాగానికి ఎన్‌‌సీఆర్‌‌పీ పోర్టల్ ద్వారా 162 ఫిర్యాదులు అందినట్లు తెలిపారు. నిందితులను త్వరలోనే అరెస్ట్ చేయనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

వివరాలు ఇచ్చినా నేరస్తులే..

కొందరు సైబర్ నేరగాళ్లు, వారి ఏజెంట్లు నెలవారీ కమీషన్ ఆశ చూపించి ఖాతాదారుల నుంచి బ్యాంకు అకౌంట్​ వివరాలు, వాటికి లింక్ అయిన ఫోన్ నంబర్లు తీసుకుంటున్నారని పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం తెలిపారు. సైబర్​ నేరాలపై గురువారం ఆయన సమీక్షించారు.

బాధితుల నుంచి మోసపూరితంగా దోచుకున్న డబ్బును ఇలాంటి మ్యూల్ అకౌంట్లకు మళ్లించి తరువాత వినియోగిస్తున్నారని చెప్పారు. తెలియని వ్యక్తులకు బ్యాంకు ఖాతాలను అద్దెకు ఇవ్వడం లేదా ఖాతా వివరాలు అందించడం నేరమని సీపీ హెచ్చరించారు. అలాంటి వారిని కూడా సైబర్ నేరగాళ్లకు సహకరించిన నేరస్తులుగానే పరిగణిస్తామని స్పష్టం చేశారు. విచారణను వేగవంతం చేసి అసలు నిందితులను త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు.