హలో మేడమ్.. మిమ్మల్ని క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేస్తరు

హలో మేడమ్.. మిమ్మల్ని క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేస్తరు
  •     యువతిని బ్లాక్ మెయిల్ చేసిన సైబర్ నేరగాళ్లు
  •     రూ.5 లక్షల 98 వేలు వసూలు 
  •     యూపీలో నిందితుడి అరెస్ట్‌

హైదరాబాద్‌, వెలుగు : కొరియర్ లో అనుమానిత వస్తువులు ఎక్స్ పోర్టు చేస్తున్నారని.. మిమ్మల్ని క్రైమ్ బ్రాంచ్ పోలీసులు చేస్తారంటూ ఓ యువతిని సైబర్ నేరగాళ్లు బెదిరించి డబ్బులు వసూలు చేశారు. ఈ కేసులో యూపీ కేంద్రంగా అకౌంట్స్ ఓపెన్ చేసి మనీల్యాండరింగ్ చేస్తున్న  సైబర్‌ ‌నేరగాడు హర్ష్‌కుమార్‌‌(24)ను సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి మొబైల్, ల్యాప్‌టాప్ స్వాధీనం చేసుకున్నారు. వివరాలను సిటీ జాయింట్‌ సీపీ ఏవీ రంగనాథ్‌ సోమవారం వెల్లడించారు. తార్నాకకు చెందిన సాఫ్ట్‌వేర్ ఎంప్లాయ్ నిత్య శ్రీకి  కొంతకాలం కిందట   ఓ ఫోన్ కాల్ వచ్చింది. ఫెడెక్స్ కొరియర్ నుంచి మీ పేరుతో అనుమానిత వస్తువులు కొరియల్ ఎక్స్ పోర్టు అవుతున్నాయని ఫోన్ చేసిన వ్యక్తి ఆమెకు చెప్పాడు. ఆమె అడ్రెస్, ఆధార్ వివరాలతో ముంబయి నుంచి తైవాన్​కు ఈ వస్తువులు కొరియర్ పార్శిల్ రూపంలో వెళ్తున్నాయన్నాడు. 

ముంబయి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు మిమ్మల్ని అరెస్ట్ చేస్తారని సదరు వ్యక్తి నిత్యశ్రీని బెదిరించాడు. కేసు లేకుండా చేస్తానని చెప్పి ఆమె దగ్గరి నుంచి రెండు విడతల్లో రూ.5 లక్షల 98 వేలు వసూలు చేశాడు. మోసపోయినట్లు గుర్తించిన బాధితురాలు ఈ ఏడాది మే 5న సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లయింట్ చేసింది. కేసు ఫైల్ చేసిన పోలీసులు బ్యాంక్ అకౌంట్ల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. ఈ మోసానికి పాల్పడ్డ ఉత్తరప్రదేశ్​ లోని అలీగఢ్ కు చెందిన హర్షకుమార్​ను అరెస్ట్ చేసి వివరాలు సేకరించారు. హర్షకుమార్ క్రిప్టో కరెన్సీ సహా ఇతర సైబర్ మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. కొట్టేసిన డబ్బును చైనాకు చెందిన అకౌంట్లకు ట్రాన్స్ ఫర్ చేస్తున్నట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. నిందితుడిని రిమాండ్ కు తరలించినట్లు జాయింట్ సీపీ రంగనాథ్​ తెలిపారు.