సైబరాబాద్ పరిధిలో రోడ్లపై నీరు నిలవకుండా, ట్రాఫిక్ కష్టాలు తలెత్తకుండా యంత్రాంగం అప్రమత్తమైంది. ఇందులో భాగంగానే అన్ని శాఖల ఉన్నతాధికారులతో ఒక కీలక సమన్వయ సమావేశం నిర్వహించారు సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ సృజన . ఈ సందర్భంగా .. వర్షాల సమయంలో ముఖ్యంగా ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయని... రోడ్లపై నీరు నిలిచే వాటర్ లాగింగ్ పాయింట్ల వల్లే ఈ జామ్‌లు పెరుగుతున్నాయని అధికారులు గుర్తించినట్లు ఆమె తెలిపారు.
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో దాదాపు 40 ప్రధాన వాటర్ లాగింగ్ పాయింట్లను గుర్తించామని కమిషనర్ సృజన తెలిపారు. ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టి... నీరు ఏమాత్రం నిల్వ ఉండకుండా తక్షణమే చర్యలు తీసుకుంటామన్నారు. మరోవైపు, వర్షాకాలంలో కూలిపోయే ప్రమాదమున్న పాత, శిథిలావస్థ భవనాలపై కూడా ఫోకస్ పెట్టామన్నారు. వాటి స్టెబిలిటీ నివేదిక ఆధారంగా... ప్రమాదకర భవనాల్లో ఉంటున్న వారిని ఖాళీ చేయించి, అవసరమైతే ఆ భవనాలను కూల్చివేయడానికి వెనకాడబోమని ఆమె స్పష్టం చేశారు.
ప్రమాదాలకు కారణమవుతున్న అక్రమ హోర్డింగ్స్ తొలగింపుపై ఇప్పటికే ప్రత్యేక డ్రైవ్ నడుస్తోందని... మరో రెండు మూడు రోజుల్లో సైబరాబాద్ పరిధిలోని ఇల్లీగల్ హోర్డింగ్స్ అన్నింటినీ పూర్తిగా తొలగిస్తామని కమిషనర్ తేల్చి చెప్పారు. అంతేకాదు, వర్షాకాలం పూర్తయ్యే వరకు బిల్డింగ్‌ల సెల్లార్ తవ్వకాలపై పూర్తి నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించారు.
ఇకపై విద్యుత్, జలమండలి, ఇంటర్నెట్ కేబుల్స్ కోసం రోడ్లు తవ్వి వదిలేస్తే తీవ్రంగా పరిగణిస్తామని కమిషనర్ సృజన హెచ్చరించారు. రోడ్డు తవ్విన తర్వాత నిర్దేశిత గడువులోపు కచ్చితంగా మరమ్మతులు పూర్తి చేయాల్సిందేనని... నిర్లక్ష్యం వహించే కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే సైబరాబాద్ పరిధిలో 225 కిలోమీటర్ల మేర నాలాల డిసిల్టింగ్ (పూడికతీత) పనులు పూర్తయ్యాయని... వర్షాకాలంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో కలిసి పనిచేస్తున్నాయని మున్సిపల్ కమిషనర్ సృజన వెల్లడించారు.
