- మ్యూల్ అకౌంట్లు సప్లై చేస్తున్నట్లు గుర్తింపు
- నిందితులు విశాఖపట్నం వాసులు
గచ్చిబౌలి, వెలుగు: సైబర్‌నేరాల కోసం మ్యూల్బ్యాంక్అకౌంట్ల సరఫరా, బ్యాంక్ అకౌంట్లలోని నగదును ఇతరుల ఖాతాలకు ట్రాన్స్ఫర్ చేస్తున్న ఆరుగురు సైబర్నేరగాళ్లను సైబరాబాద్సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.26.57 లక్షలు రివకరీ చేసినట్లు డీసీపీ సాయి మనోహర్ తెలిపారు. గచ్చిబౌలిలోని సైబరాబాద్ కమిషనరేట్ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. గండిపేట్‌లో నివాసం ఉండే రియల్ ఎస్టేట్‌వ్యాపారి సురేశ్‌రెడ్డికి ఫేస్బుక్లో ట్రేడింగ్‌కు సంబంధించిన యాడ్ వచ్చింది.
దానికి ఆయన రెస్పాండ్అవడంతో కీర్తి నాయుడు అనే మహిళ కాల్చేసి, ఎల్లోరా అనే వాట్సాప్ ట్రేడింగ్ గ్రూప్ లో యాడ్‌చేసింది. తర్వాత సురేశ్‌రెడ్డి మొదటి ట్రేడింగ్‌లో రూ.10 వేలు పెట్టుబడి పెట్టాడు. మరో యువతి కాల్ చేసి మీకు మెంటార్‌గా ఉంటానని చెప్పి, అతనికి ట్రేడింగ్‌పై కొంత శిక్షణ ఇచ్చింది. గత ఫిబ్రవరిలో సదరు యువతి చెప్పినట్లు సురేశ్‌రెడ్డి రూ.21.60 లక్షలు పెట్టుబడి పెట్టాడు. దీంతో అతనికి రూ.1.21 లక్షల ప్రాఫిట్వచ్చినట్లు చూపెట్టారు. ఇది నమ్మిన సురేశ్‌రెడ్డి మరోసారి రూ.21.90 లక్షలు పెట్టుబడి పెట్టగా.. రూ.2 కోట్లు ప్రాఫిట్ వచ్చినట్లు చూపించడంతో విత్‌డ్రా చేసుకునేందుకు ప్రయత్నించాడు.
సాధ్యం కాకపోవడంతో మెంటార్‌ను సంప్రదించగా.. రూ.41 లక్షల ఐటీ కట్టాలని చెప్పడంతో.. సురేశ్‌రెడ్డి వారు సూచించిన బ్యాంక్ అకౌంట్లకు ఆ మొత్తాన్ని పంపించాడు. తర్వాత ట్యాక్స్‌ల పేరుతో రూ.14.60 లక్షలు పంపాడు. ఇలా మొత్తం రూ.95 లక్షలు చెల్లించాడు. ఇంకా డబ్బులు అడుగుతుండటంతో మోసపోయానని గ్రహించి, సైబర్‌క్రైం పోలీసులను ఆశ్రయించాడు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. సైబర్ నేరస్తులకు బ్యాంక్ అకౌంట్లు సప్లై చేయడం, డబ్బులు విత్‌డ్రా చేయడం చేస్తున్న విశాఖపట్నంకు చెందిన గౌతమ్, పెంటయ్య, సాయికుమార్, సత్యనారాయణ, మంత్రి సాయికుమార్, ఉట్ల సత్యనారాయణలను అరెస్ట్ చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితులను త్వరలోనే పట్టుకుంటామని డీసీపీ పేర్కొన్నారు.
