OTT Review: నరాలు తెగే సస్పెన్స్, ఉత్కంఠ పెంచే ఇన్వెస్టిగేషన్.. క్రైమ్ థ్రిల్లర్ ఆడియన్స్‌కు వీకెండ్ బెస్ట్ సిరీస్?

OTT Review: నరాలు తెగే సస్పెన్స్, ఉత్కంఠ పెంచే ఇన్వెస్టిగేషన్.. క్రైమ్ థ్రిల్లర్ ఆడియన్స్‌కు వీకెండ్ బెస్ట్ సిరీస్?

నరాలు తెగే సస్పెన్స్‌తో కూడిన ఓ క్రైమ్ థ్రిల్లర్ ఓటీటీ ప్రియులను అలరిస్తుంది. ఉత్కంఠకు గురిచేసే స్క్రీన్ ప్లేతో ఆడియన్స్ను కట్టిపడేస్తుంది. అదే బాలీవుడ్ మాస్ అండ్ క్లాస్ నటుడు, 'మీర్జాపూర్' గుడ్డూ భయ్యా ఫేమ్ అలీ ఫజల్ ప్రధాన పాత్రలో నటించిన పవర్‌ఫుల్ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సిరీస్ ‘రాఖ్’ (Raakh). ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియో ఒరిజినల్‌గా రూపొందించిన ఈ ప్రతిష్టాత్మక సిరీస్ జూన్ 12 నుంచి ప్రపంచవ్యాప్తంగా 240కి పైగా దేశాల్లో స్ట్రీమింగ్ అవుతుంది.

ఈ సిరీస్‌కు ఢిల్లీలో సంచలనం సృష్టించిన ‘రంగా-బిల్లా’ కేసు స్ఫూర్తిగా నిలిచింది. ఆ కేసులో కుల్జీత్ అలియాస్ రంగా, జస్బీర్ సింగ్ అలియాస్ బిల్లా ఇద్దరు టీనేజ్ యువకులను అత్యాచారం చేసి హత్య చేసిన నేరంలో దోషులుగా తేలి ఉరిశిక్ష పొందారు. గతంలో 'పాతాళ్ లోక్' వంటి సూపర్ హిట్ వెబ్‌సిరీస్‌తో ప్రేక్షకులను థ్రిల్ చేసిన టాలెంటెడ్ డైరెక్టర్ ప్రొసిత్ రాయ్ ఈ సిరీస్‌ను రూపొందించి సక్సెస్ అయ్యారు.

ఇందులో అలీ ఫజల్ సబ్‌ఇన్‌స్పెక్టర్ జయప్రకాష్‌గా నటించగా, సోనాలి బింద్రే మోనా అరోరా పాత్రలో కనిపించనుంది. దుఃఖం, న్యాయం, నేరాల ప్రభావం వంటి అంశాలతో రూపొందిన ఈ ఇన్వెస్టిగేషన్ డ్రామా ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది. 

కథేంటంటే:

ఢిల్లీలో కర్నల్ అశోక్ (అమీర్ బషీర్) ఫ్యామిలీ నివసిస్తుంటుంది. భార్య మోనా (సోనాల్ బెంద్రే) టీచర్​గా పనిచేస్తుంటుంది. పిల్లలు సుమన్ (దివ్య శర్మ), సోహెల్ (వివాన్ శర్మ) అదే స్కూల్ లోనే చదువుతుంటారు. సుమన్ ఆల్ ఇండియా రేడియోలో తరచూ పాటలు పాడుతూ ఉంటుంది. అలాగే ఒక రోజు తమ్ముడు సోహెల్​తో కలిసి ఆమె పాటలు పాడటానికి వెళ్తుంది. కానీ ఆ తరువాత ఇద్దరు పిల్లలూ తిరిగిరారు. మిస్సింగ్ కేసును నమోదు చేసి పోలీసులు రంగంలోకి దిగుతారు. ఈ కేసును సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలనే పట్టుదలతో ఎస్. ఐ జయప్రకాశ్ (అలీఫజల్) ఉంటాడు. ఓ ప్రముఖ దినపత్రికలో రిపోర్టర్​గా పనిచేస్తున్న నిసార్ కూడా ఆధారాలు సేకరించే పనిలో పడుతుంది. ముంబైలో చిల్లర దొంగతనాలు చేసే ఇద్దరు వ్యక్తులే పిల్లల మిస్సింగ్​కి కారణం అనే అనుమానాలు బలపడుతూ ఉంటాయి. ఈ కేసు ఛేదించడానికి ప్రయత్నిస్తోన్న జయప్రకాశ్​కి ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి? వాటిని ఆయన ఎలా అధిగమిస్తాడు? అనేదే ఈ సిరీస్​.

విశ్లేషణ:

‘రాఖ్’ సాధారణ క్రైమ్ థ్రిల్లర్‌లా కాకుండా.. ఒక నిజ జీవిత ఘటనకు కల్పిత అంశాలను జోడించి రూపొందించిన ఎమోషనల్ ఇన్వెస్టిగేషన్ డ్రామాగా ఆకట్టుకుంటుంది. దర్శకుడు ప్రొసిత్ రాయ్ కథను కేవలం క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కే పరిమితం చేయకుండా.. బాధిత కుటుంబం ఎదుర్కొనే మానసిక వేదన, న్యాయం కోసం జరిగే పోరాటాన్ని కూడా హృదయానికి హత్తుకునేలా చూపించారు.

సిరీస్ ప్రారంభం నుంచే పిల్లల అదృశ్యంతో ఏర్పడే ఉత్కంఠ ప్రేక్షకులను కథలోకి లాక్కెళ్తుంది. ప్రతి ఎపిసోడ్‌లో కొత్త ఆధారాలు, అనుమానితుల చుట్టూ తిరిగే దర్యాప్తు ఆసక్తిని పెంచుతుంది. ముఖ్యంగా పోలీసు అధికారిగా అలీ ఫజల్ నటన సిరీస్‌కు ప్రధాన బలంగా నిలిచింది. కేసును ఛేదించాలనే అతడి పట్టుదల, భావోద్వేగ సన్నివేశాల్లో చూపిన నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

మరోవైపు సోనాలి బింద్రే పోషించిన తల్లి పాత్ర ప్రేక్షకుల మనసులను కదిలిస్తుంది. పిల్లలను కోల్పోయిన ఓ తల్లి ఆవేదనను ఆమె సహజంగా ఆవిష్కరించారు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, డార్క్ విజువల్స్, రియలిస్టిక్ ట్రీట్‌మెంట్ కథకు మరింత బలం చేకూర్చాయి. అయితే కొన్ని ఎపిసోడ్‌లలో కథనం నెమ్మదిగా సాగడం, కొన్ని సన్నివేశాలు మరింత బలంగా ఉండాల్సిన అవసరం కనిపిస్తుంది. అయినప్పటికీ క్లైమాక్స్ వరకు సస్పెన్స్‌ను నిలబెట్టడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. 

మొత్తంగా చూసుకుంటే, ‘రాఖ్’ ఉత్కంఠభరితమైన స్క్రీన్‌ప్లే, బలమైన నటన, భావోద్వేగాలతో కూడిన క్రైమ్ థ్రిల్లర్‌గా నిలుస్తుంది. సస్పెన్స్, ఇన్వెస్టిగేషన్ డ్రామాలు ఇష్టపడే ఓటీటీ ప్రేక్షకులకు ఇది మంచి ఛాయిస్ అని చెప్పొచ్చు.