కేరళకు చెందిన త్రీహార్ట్స్ సంస్థ ఈ రోబో ఏనుగును రూపొందించింది. 5 మీటర్ల ఎత్తు ఉన్న ఈ రోబో ఏనుగులా తల ఊపడం, చెవులు, కళ్లను కదిలించడం, తోకను ఆడించడం, తొండం పైకి లేపడం వంటివి చేయగలదు. విద్యుత్ కనెక్షన్ ద్వారా వీటిని ఈజీగా ఆపరేట్ చేయొచ్చు. వీల్‌బేస్‌పై అమర్చి ఉండటం వల్ల ఊరేగింపుల కోసం వీటిని ఈజీగా తీసుకెళ్లొచ్చని పెటా సభ్యురాలు సంస్కృతి చెప్పారు.
పెటా సంస్థ ఇప్పటికే కేరళ, తమిళనాడు, కర్ణాటకల్లోని దేవాలయాల్లో 25 రోబోటిక్ ఏనుగులను విరాళంగా అందించింది. కేరళలోనే ప్రముఖ దేవాలయాల్లోనే10కి పైగా ఏనుగులను బహుకరించింది. తాజాగా తెలంగాణలోని హైదరాబాద్ జూపార్క్‌లో ఏర్పాటు చేసేందుకు రోబో ఏనుగును పెటా అందించింది. ‘‘ఇప్పటికే హైదరాబాద్ జూపార్కులో నాలుగు ఏనుగులు సందర్శకులను కనువిందు చేస్తున్నాయి. వాటికి రోబో ఏనుగు కూడా తోడైంది.
ఇది సందర్శకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంద’’ని జూపార్క్ డైరెక్టర్ సునీల్ హీరేమత్ చెప్పారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం గుర్రంగూడ ఫారెస్ట్ బ్లాక్‌లో జరిగిన వన మహోత్సవం 2026 కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ రోబోటిక్ ఏనుగును ‘పెటా ఇండియా’ నుంచి అధికారికంగా స్వీకరించి, తెలంగాణ ప్రజలకు అంకితం చేశారు.
వక్ఫ్ బోర్డుకు రోబోటిక్ ఏనుగు
దేశవ్యాప్తంగా ఉన్న హిందూ దేవాలయాలు, ఒక జైన దేవాలయంలో 40కి పైగా రోబోటిక్ ఏనుగులను ఉపయోగిస్తున్నారు. నిజమైన ఏనుగులను ఎన్నడూ సొంతం చేసుకోకూడదని లేదా అద్దెకు తీసుకోకూడదని దేవాలయాలు తీసుకున్న నిర్ణయాలను గుర్తించి, పెటా ఇండియా వాటిలో 27 ఏనుగులను విరాళంగా ఇచ్చింది.
నటి, గాయని జహ్రా ఎస్. ఖాన్, పెటా ఇండియా కలిసి తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డుకు రోబోటిక్ ఏనుగును బహుమతిగా అందజేయనున్నారు. నిజమైన ఏనుగుల స్థానంలో రోబోటిక్ ఏనుగులను ఉపయోగించాలని కోరుతూ, పెటా ఇండియా ఈ బహుమతిని రాష్ట్రంలోని మైనారిటీ సంక్షేమ, దేవాదాయ శాఖలకు కూడా అందించింది.
‘‘అడవుల్లో తిరిగే ఏనుగులను ఇలా బంధించడం వల్ల వన్యప్రాణుల మనుగడకు ముప్పు ఏర్పడుతుంది. అందుకే వాటికి పునరావాసం కల్పించాలనే లక్ష్యంతో అసలైన ఏనుగులను అడవికి తరలించి తాము రోబోటిక్ ఏనుగులను బహుమతిగా అందిస్తున్నామ’’ని పెటా ప్రతినిధి అనుష్క చెప్పారు.
