- రూ.57 లక్షల నగదులో రూ.30 లక్షలు రికవరీ
గచ్చిబౌలి, వెలుగు: ఐటీ కారిడార్లో సంచలనం సృష్టించిన ఏటీఎం క్యాష్ వ్యాన్ చోరీ కేసును సైబరాబాద్ పోలీసులు ఛేదించారు. ఏటీఎంలలో నింపాల్సిన రూ. 57 లక్షల నగదుతో పరారైన డ్రైవర్ అజిత్ కుమార్ను 11 రోజుల సుదీర్ఘ గాలింపు తర్వాత ఏపీలోని అనంతపురంలో సైబరాబాద్ సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
నిందితుడి నుంచి రూ. 30 లక్షల నగదును రికవరీ చేసి గచ్చిబౌలి పోలీసులకు అప్పగించారు. ఈ నెల 12న ఐటీ కారిడార్ లోనిగోపన్పల్లి యాక్సిస్ బ్యాంక్ ఏటీఎం వద్దకు సంగం సెక్యూరిటీ సొల్యూషన్స్సంస్థకు చెందిన సీఎంఎస్వాహనం డబ్బులు డిపాజిట్చేసేందుకు వచ్చింది. కస్టోడియన్లు లోపలికి వెళ్లడం, సెక్యూరిటీ గార్డు పక్కకు వెళ్లడం గమనించిన డ్రైవర్ అజిత్.. క్షణాల వ్యవధిలో నగదు వాహనంతో ఉడాయించాడు.
అనంతరం తెల్లాపూర్ వద్ద వ్యాన్ను వదిలేసి, డబ్బు సంచులతో ఆటోలో లింగంపల్లికి, అక్కడ హోటల్ నుంచి అనంతపురానికి చెక్కేశాడు. అయితే, పోలీసులు సీసీ కెమెరాల నెట్వర్క్ను జల్లెడ పట్టి నిందితుడి ఆచూకీ కనిపెట్టారు. పరారీలో ఉన్న సమయంలో అజిత్ మిగిలిన నగదును ఎక్కడ ఖర్చు చేశాడు? ఎవరికైనా ఇచ్చాడా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.
