మేడిపల్లి, వెలుగు: డబ్బులియ్యకపోతే అమెరికాలో ఉన్న నీ కొడుకును చంపేస్తామంటూ ఆర్టీసీ మహిళా కండక్టర్ను సైబర్ నేరగాళ్లు అందినకాడికి దోచుకున్నారు. మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బుధానగర్కు చెందిన కల్పన ఆర్టీసీ కండక్టర్. ఆమె కొడుకు రవి రోహన్ చంద్రన్ అమెరికాలో చదువుకుంటుండగా, ఈ నెల 3న ఆమెకు వాట్సాప్లో అంతర్జాతీయ నంబర్ నుంచి దుండగులు కాల్ చేశారు. మీ అబ్బాయి ఒక యువతిని వేధించిన కేసులో అమెరికాలో చిక్కుకున్నాడని, వెంటనే డబ్బులు పంపకపోతే చంపేస్తామని బెదిరించారు.
ఇదే కాల్లోనే ‘మామ్.. నన్ను కొడుతున్నారు’ అని కొడుకు గొంతు వినిపించేలా చేసి బాధితురాలిని తీవ్ర భయాందోళనకు గురిచేశారు. తొలుత రూ. 15 లక్షలు డిమాండ్ చేసిన దుండగులు.. ఆమె బతిమిలాడటంతో ఆ మొత్తాన్ని రూ. 1 లక్షకు తగ్గించాడు. దీంతో కంగారు పడిన బాధితురాలు దుండగులు సూచించిన యూపీఐ ఐడీకి నాలుగు విడతల్లో రూ. 70 వేలు బదిలీ చేసింది. ఆ తర్వాత కూడా మరిన్ని డబ్బుల కోసం వేధించడంతో అనుమానం వచ్చిన కల్పన.. కుటుంబ సభ్యుల సాయంతో ఇది సైబర్ మోసమని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
