దూసుకొస్తున్న‘గులాబ్ ‘.. దంచికొడుతున్న వానలు

దూసుకొస్తున్న‘గులాబ్ ‘.. దంచికొడుతున్న వానలు

గులాబ్ తుఫాన్ తీరం దాటింది. దీంతో తుఫాన్ అల్పపీడనంగా మారిందని వాతావరణశాఖ తెలిపింది. మరికొన్ని గంటల్లో బలహీనపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. గులాబ్ తుఫాన్ ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మంతో పాటు... పలు జిల్లాల్లో రాత్రి నుంచి భారీ వర్షం పడుతోంది. ఇటు సిటీలోనూ ముసురు వాన కురుస్తోంది.  

హైదరాబాద్ సిటీలో ఉదయం నుంచి వర్షం పడుతోంది. కొన్ని ప్రాంతాల్లో వర్షం దంచికొడుతోంది. ఉప్పల్, నాగోల్, ఎల్బీనగర్, దిల్ సుఖ్ నగర్,  మలక్ పేట, కోఠి, నాంపల్లి, అబిడ్స్ లో భారీ వర్షం పడుతోంది. అమీర్ పేట, పంజాగుట్ట, మాసబ్ ట్యాంక్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్ ఏరియాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. భారీ వర్షంతో చాలా చోట్ల రోడ్లపై నీళ్లు నిలిచిపోయాయి. ఉదయం ఆఫీసులకు బయలుదేరే వారు తీవ్ర అవస్థలు పడుతున్నారు. 

ఇప్పటికే భారీ వర్షాలతో ప్రాజెక్టులు ఫుల్ అయ్యాయి. రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలతో చెరువులు మత్తడి దూకుతున్నాయి. వాగులు పొంగుతున్నాయి. అటు ప్రాజెక్టులకు భారీగా వరద వస్తుండటంతో వచ్చిన నీటిని...వచ్చినట్లు దిగువకు రీలీజ్ చేస్తున్నారు. అటు లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు..

తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలో రెండు రోజుల పాటు అతిభారీ నుంచి అత్యంత భారీ వర్షాలుంటాయని హెచ్చరించింది వాతావరణశాఖ. ఉత్తర తెలంగాణ జిల్లాలకు రెడ్ అలర్ట్, దక్షిణ తెలంగాణ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. భారీ వర్షాలతో జిల్లా కలెక్టర్లను అలర్ట్ చేశారు సీఎస్ సోమేశ్ కుమార్. ప్రతీ జిల్లా కలెక్టరేట్లో  ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా ఏడు జిల్లాలపై గులాబ్ తుఫాన్ ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉంది.

రెడ్ అలర్ట్ జారీ చేసిన నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, సిరిసిల్ల, పాలమూరు, వరంగల్  జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. మరో 17 జిల్లాలకు ఆరెంజ్  అలర్ట్ ను ప్రకటించింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, హనుమకొండ, జనగామ, మెదక్ , యాదాద్రి, రంగారెడ్డి, హైదరాబాద్ , మేడ్చల్ -మల్కాజిగిరి, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాలు ఉన్నాయి. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇతర జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. 

గులాబ్ తుఫాన్ ప్రభావంతో మరో మూడురోజుల పాటు భారీవర్షాలు కురుస్తాయనే వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో జీహెచ్ ఎంసీ అప్రమత్తమయ్యింది. లోతట్టు ప్రాంతాల పట్ల అప్రమత్తతతోపాటు.. భారీవర్షాల నేపథ్యంలో పడవలు, పంపులు, ఇతర యంత్రాలు సిద్ధంగా ఉంచుకొవాలని అధికారులు ఆదేశించారు. కాగా, ఏపీలోనూ భారీ వర్షాలుంటాయని విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. తీర ప్రాం తాలను అప్రమత్తం చేసింది. తుపాను నేపథ్యంలో పలు రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది.