ముంచుకొస్తున్న 'సెన్యార్' తుఫాను.. తమిళనాడులో మొదలైన వర్షాలు.. ఇక నెక్ట్స్ ఏపీ, తెలంగాణనే..!

ముంచుకొస్తున్న 'సెన్యార్' తుఫాను.. తమిళనాడులో మొదలైన వర్షాలు.. ఇక నెక్ట్స్ ఏపీ, తెలంగాణనే..!

చెన్నై: నవంబర్ 22న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని చెన్నై వాతావరణ కేంద్రం తెలిపింది. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ నవంబర్ 24న ఈ అల్పపీడనం కాస్తా 'సెన్యార్' తుఫానుగా బలపడే అవకాశం ఉందని పేర్కొంది. ఈ తుఫాను ప్రభావంతో.. నవంబర్ 27 వరకు తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్‌లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 

కన్యాకుమారి, తిరునెల్వేలి, తూత్తుకుడి, తెన్‌కాసి, రామనాథపురం, తంజావూరు, తిరువారూర్, నాగపట్నం, కడలూరు, మైలాడుతురై జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. చెన్నైలో శనివారం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని చెన్నై వాతావరణ కేంద్రం పేర్కొంది. ఏపీ, తెలంగాణపై కూడా సెన్యార్ తుఫాను ప్రభావం ఉండొచ్చని తెలిపింది.

ఇక.. తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రాకు కూడా వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేసింది. ఇవాళ నుంచి తుఫాను ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమలో వర్షాలు కురుస్తాయని తెలిపింది. ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. 

ఈ నెల 27 వరకు తమిళనాడు, పుదుచ్చేరికి వర్ష సూచన చేసింది. మోంథా తుఫాను ప్రభావంతో చెన్నై నగరంలో ఇప్పటికే భారీ వర్షాలు కురిశాయి. మోంథా తుఫాను సమయంలో.. చెన్నై, తిరువళ్లూరు, రాణిపేట, కాంచీపురంతో సహా ఉత్తర తమిళనాడులో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి.