బీహార్‌లో దారుణం జరిగింది. 2023 ఆగస్టు 18న అరారియా జిల్లాలో తెల్లవారుజామున ఐదు గంటల ప్రాంతంలో ఓ జర్నలిస్టును గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. జర్నలిస్టును విమల్ కుమార్ యాదవ్‌గా గుర్తించారు. విమల్ నివాసంలోనే కాల్పులు జరిపినట్లు సమాచారం. నలుగురు దుండగులు కలిసి ఈ ఘటనను పాల్పడినట్లుగా తెలుస్తోంది.
ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ప్రస్తుతం దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. విమల్ సింగ్ యాదవ్ గత కొన్నేళ్లుగా దైనిక్ జాగరణ్ వార్తాపత్రికలో బ్లాక్ రిపోర్టర్‌గా పనిచేస్తున్నాడు. కాల్పులు జరిగిన వెంటనే విమల్ సింగ్ యాదవ్‌ను హుటాహుటిన రాణిగంజ్ రిఫరల్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించిన అనంతరం మృతి చెందినట్లు నిర్ధారించారు.
ఈ ఘటనపై స్థానికుల నుంచి తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. నేరస్తులను వీలైనంత త్వరగా పట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అటు జర్నలిస్టుల్లో అభద్రతా భావం ఏర్పడి ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే హత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. చనిపోయిన జర్నలిస్టు సోదరుడిని కూడా కొన్నేళ్ల క్రితం ఇదే తరహాలో నేరగాళ్లు కాల్చి చంపినట్లు సమాచారం.
