పది రోజులు కరెంట్ లైన్ల వెంట తిరగాల్సిందే : సీఎండీ జితేష్ వి.పాటిల్

పది రోజులు కరెంట్ లైన్ల వెంట తిరగాల్సిందే : సీఎండీ జితేష్ వి.పాటిల్
  • సమస్యలు గుర్తించి వెంటనే పరిష్కరించండి
  • కరెంట్​ పోల్స్,​ లైన్లపై స్పెషల్​ డ్రైవ్‌కు సీఎండీ జితేష్​ వి.పాటిల్ ఆదేశం
  • దక్షిణ డిస్కం పరిధిలోని ఆఫీసర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎండీ

హైదరాబాద్‌, వెలుగు: దక్షిణ డిస్కం పరిధిలో పనిచేస్తున్న ప్రతి విద్యుత్‌ ఉద్యోగి తమ పరిధిలో ఉన్న విద్యుత్‌ లైన్ల వెంట పది రోజుల పాటు తిరిగాల్సిందేనని ఆ సంస్థ సీఎండీ జితేష్​ వి.పాటిల్ ఆదేశించారు. సమస్యలను గుర్తించి అక్కడికక్కడే పరిష్కరించాలన్నారు. ఆదివారం డిస్కం పరిధిలో పనిచేస్తున్న సంస్థ డైరెక్టర్లు, వివిధ జిల్లాల చీఫ్ ఇంజినీర్లు, సూపరింటెండెంట్ ఇంజినీర్లు, డీఈలతో వర్షాకాలం సన్నద్ధతపై ఆయన టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా సీఎండీ ‘వాక్​ అలాంగ్​ ది లైన్​’ పేరిట ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రకటించారు. కరెంట్ పోల్స్,​ లైన్లపై పది రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామన్నారు. ప్రతి నెలా 10 నుంచి 20 వరకు ఉదయం 9 నుంచి 10 గంటల వరకు డిస్కం పరిధిలో అన్ని స్థాయిల ఉద్యోగులు విద్యుత్ లైన్ల సమస్యలను గుర్తించాలన్నారు. దెబ్బతిన్న, వంగిపోయిన స్తంభాలకు రిపేర్లు చేయాలన్నారు. వదులుగా ఉన్న, వేలాడుతున్న విద్యుత్ తీగలను సరిచేయాలని, దెబ్బతిన్న ఇన్సులేటర్లు, కండక్టర్లను గుర్తించి మార్చాలన్నారు. ప్రతి పనిని జీఐఎస్​ కోఆర్డినేట్లతో నమోదు చేసి పనికి ముందు, పని చేసిన తరువాత ఫొటోలు తీయాలని సీఎండీ ఆదేశించారు. వినియోగదారులతో ప్రత్యక్షంగా మాట్లాడి సమస్యలను తెలుసుకోవాలని తెలిపారు.

ఫీడర్ నిర్వహణ - చెట్ల కొమ్మల తొలగింపు

వర్షాకాలంలో విద్యుత్ అంతరాయాలు జరగకుండా రెండు వారాల పాటు ప్రత్యేక ఫీడర్ మెయింటెనెన్స్, చెట్ల కొమ్మల కత్తిరింపు కార్యక్రమం చేపట్టాలని సీఎండీ ఆదేశించారు. ఎక్కువ అంతరాయాలు నమోదవుతున్న ఫీడర్లకు ప్రాధాన్యతనిస్తూ ప్రత్యేక షెడ్యూల్ రూపొందించాలన్నారు. స్థానిక సంస్థలతో సమన్వయం చేసుకుని తొలగించిన చెట్ల కొమ్మలను తరలించాలన్నారు.

కార్యక్రమంలో భాగంగా కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (క్యూర్​) పరిధిలోని అన్ని సర్కిళ్లలో 33 కేవీ సబ్‌స్టేషన్లు, 33 కేవీ, 11 కేవీ ఫీడర్లు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లు (డీటీఆర్​)లు,  ఎల్.టి. నెట్‌వర్క్‌లను తనిఖీ చేసి రిపోర్ట్ అందజేయాల్సిందిగా ఆదేశించారు. త్వరలోనే ఫీల్డ్​ సిబ్బందికి ఆధునిక పరికరాలు, నాణ్యమైన రెయిన్ కోట్లు, ప్రత్యేక యూనిఫాంలు అందజేస్తామన్నారు. స్కూళ్లు, పార్కులు, ప్రజలు ఎక్కువగా తిరిగే ప్రదేశాల్లో భద్రతా స్టిక్కర్లు ఏర్పాటు చేయాలన్నారు.  --