
దళితబంధు వస్తుందో..రాదోనని ఇద్దరు లబ్ధిదారులు ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపుతోంది. హుజురాబాద్ నియోజకవర్గంలో జనవరి 28న ఒకరు..ఇవాళ ఒకరు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వీళ్లిద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
వీణవంక మండలం కేంద్రానికి గాజుల అమల అనే గృహిణి ఇవాళ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. దళితబంధు మొదటి విడతలో వచ్చిన రూ. 5 లక్షలతో ఫొటో స్టూడియో ఏర్పాటు చేశారు దంపతులిద్దరు. మరో మూడు లక్షలు అప్పుతెచ్చారు. రెండో విడుతలో వచ్చే దళితబంధు వస్తే అప్పు తీర్చేద్దామనుకున్నారు. అయితే ప్రభుత్వం మారడంతో దళితబంధు వస్తుందో రాదేమోనన్న అనుమానంతో ఇవాళ పురుగుల మందు తాగింది మహిళ. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
ఇక జనవరి 28న జమ్మికుంట మండల కేంద్రంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ ఏరియాలో బొడికెల శ్రీనివాస్ అనే వ్యక్తి కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మొదటి విడత దళితబంధులో వచ్చిన ఐదు లక్షలతో పాటు మరిన్ని డబ్బులు అప్పు తెచ్చి డీజె సౌండ్ సిస్టం కొనుగోలు చేశాడు. తనకు రావాల్సిన రెండో విడత దళితబంధు రాదని స్థానిక నేతలు చెప్పడంతో మనస్థాపానికి గురైన అతను కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. దీంతో తీవ్ర గాయాలయిన అతడిని ఆస్పత్రికి తరలించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన దళితబంధు పథకంపై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. దళితబంధు పథకం అమలులో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయని... నేతలు కమీషన్లు తీసుకుంటున్నారని స్వయంగా సీఎంగా ఉన్నప్పుడు కేసీఆరే ఎమ్మెల్యేలపై ఆగ్రహం వ్యక్తం చేయడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది.
ఈ పథకం చాలా చోట్ల బీఆర్ఎస్ లీడర్లు తమ పార్టీ మద్దతుదారులకే ఇచ్చుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. చాలా మంది లబ్దిదారులకు దళితబంధు రాలేదు. బీఆర్ఎస్ పై గ్రామాల్లో వ్యతిరేకత కూడా ఏర్పండి.