అనర్హులకు దళితబంధు..తహసీల్దార్ ఆఫీస్ ముందు దళితుల ఆందోళన

అనర్హులకు దళితబంధు..తహసీల్దార్ ఆఫీస్ ముందు దళితుల ఆందోళన

దళిత బంధు పథకం లబ్ధిదారుల ఎంపికలో అక్రమాలు జరిగాయని కరీంనగర్ జిల్లా వీణవంకలో దళితులు ఆందోళనకు దిగారు. వీణవంక తహశీల్దార్ ఆఫీస్ ముందు ఆందోళన చేపట్టారు. తహశీల్దార్ తో వాగ్వాదానికి దిగారు దళితులు. ఈ నెల 16న జరగనున్న చెక్కుల పంపిణీ కార్యక్రమానికి లబ్ధిదారులను ఎంపిక చేశారు అధికారులు. అయితే అర్హులైన వారికి కాకుండా ఉద్యోగులు, స్థానికంగా నివసించనివారిని ఎంపిక చేశారని దళితులు ఆరోపించారు. 

లబ్ధిదారుల తుది జాబితా ఏ ప్రాతిపదికన సిద్ధం చేశారంటూ తహశీల్దార్ ను ప్రశ్నించారు దళితులు. దళిత బంధు పథకంలో వీణవంక మండల కేంద్రానికి 35 యూనిట్స్ మంజూరుకాగా... టీఅర్ఎస్ కార్యకర్తలనే లబ్ధిదారులుగా గుర్తించారని ఆరోపించారు. ఈ నెల 16న హుజూరాబాద్ మండలం శాలపల్లి- ఇందిరానగర్ వద్ద జరిగే దళితబంధు సభలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా వీణవంక మండలంలోని 26 గ్రామాల్లోని  351మంది లబ్ది దారులకు 10లక్షలు  అందజేయనున్నారు. ఇందుకోసం ఫైనల్ లిస్టు ప్రిపేర్ చేయగా అందులో చాలామంది ఉద్యోగులు, స్థానికేతరులు, టీచర్లు ఉన్నారని చెబుతున్నారు. నిరుపేదలను, ఇల్లు లేని వారిని, కూలీలను వదిలేసి ఆర్థికంగా ఉన్న దళితులనే పథకానికి ఎలా ఎంపిక చేస్తారని నిలదీశారు. వీణవంకతో పాటు చాలా గ్రామాల్లో లబ్ధిదారుల ఎంపిక సరిగా జరగలేదని ఆరోపించారు. ధర్నాలో వీణవంక ఉప సర్పంచ్ భానుచందర్ తో పాటు మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడు మేకల ఎల్లారెడ్డి, స్థానిక దళిత ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అయితే ఇది ఫైనల్ లిస్ట్ కాదని త్వరలోనే లిస్ట్ విడుదల చేస్తామని తహశీల్దార్ సర్ది చెప్పేందుకు ప్రయత్నించారు.