సనత్ నగర్ టిమ్స్ పనులు త్వరగా పూర్తి చేయండి ..అధికారులకు మంత్రి దామోదర ఆదేశం

సనత్ నగర్ టిమ్స్ పనులు త్వరగా పూర్తి చేయండి ..అధికారులకు మంత్రి దామోదర ఆదేశం

హైదరాబాద్, వెలుగు: సనత్ నగర్ లో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్న టిమ్స్ ఆస్పత్రి పనులను త్వరగా పూర్తి చేసి, ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. గురువారం హాస్పిటల్​లోని అన్ని విభాగాలను పరిశీలించి, పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు.

అత్యాధునిక ఎక్విప్​మెంట్, ఇన్​ఫ్రాస్ట్రక్చర్, ల్యాబొరేటరీలు, బ్లడ్ బ్యాంక్ తోపాటు విదేశీ పేషెంట్ల కోసం ఏర్పాటు చేస్తున్న స్పెషల్ బ్లాక్ లలో వసతులను తనిఖీ చేశారు. డాక్టర్ల కోసం విడివిడిగా హాస్టల్ బ్లాక్​లు, పేషెంట్ల సహాయకుల కోసం ధర్మశాల, రెండు క్యాంటీన్లు, మల్టీలెవల్ పార్కింగ్ సిస్టమ్ అందుబాటులోకి తేవాలని సూచించారు.

పేషెంట్లకు సరిపడా టాయిలెట్స్, ఆధునిక ఇంటీరియర్, లాంజ్ లు ఏర్పాటు చేయాలని చెప్పారు. ఆస్పత్రి ప్రధాన ద్వారం వద్ద పోలీస్ ఔట్ పోస్టుతోపాటు అడ్మినిస్ట్రేషన్ భవనం, టీబీ హాస్పిటల్ బోర్డు ఆఫీస్​పనులను వేగంగా పూర్తి చేయాలన్నారు. అంతర్జాతీయ స్థాయి ల్యాబొరేటరీ ఏర్పాటుపై డీఎంఈ, టీజీఎంఎస్ఐడీసీ అధికారులతో కూడిన ప్రత్యేక కమిటీని నియమించారు. డ్రైనేజీ, శానిటేషన్, వాటర్ సప్లై వంటి సేవల్లో ఎక్కడా అంతరాయం కలగకుండా నిరంతర పర్యవేక్షణ ఉండాలని చెప్పారు. కార్యక్రమంలో వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్​క్రిస్టినా జెడ్ చొంగ్తు, డీఎంఈ నరేంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు.