ఫ్రంట్ పేరుతో కేసీఆర్ తీర్థయాత్రలు : శ్రవణ్

ఫ్రంట్ పేరుతో కేసీఆర్ తీర్థయాత్రలు : శ్రవణ్
  • నల్సార్ లో రిజర్వేషన్లు అమలు కావడం లేదంటూ కేసీఆర్ కు లెటర్
  • ఫ్రంట్ పై కేసీఆర్ పగటి కలలు కంటున్నారు
  • కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసోజ్ శ్రవణ్

ఢిల్లీ: నల్సార్ యూనివర్సిటీ విద్యార్థులకు న్యాయం చేయాలంటూ కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసోజ్ శ్రవణ్… సీఎం కేసీఆర్ కి బహిరంగ లేఖ రాశారు.  తెలంగాణ స్థానిక రిజర్వేషన్లు ,371(d) రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం నల్సార్ యూనివర్సిటీలో రిజర్వేషన్లు అమలు కావడం లేదని లెటర్ లో వివరించారు. చట్ట ప్రకారం 85 శాతం రిజర్వేషన్లు స్థానికులకు దక్కాల్సి  ఉండగా అవేవీ అమలు కావట్లేదన్నారు. 29 శాతం రిజర్వేషన్లు బీసీలకు దక్కాలి కానీ చట్టం అమలు కాకపోవడంతో తెలంగాణ విద్యార్థులు తీవ్రంగా నష్ట పోతున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఇదే తరహా విశ్వవిద్యాలయంలో చట్టం అమలు చేస్తున్నప్పుడు.. తెలంగాణలో ఎందుకు అమలు చేయడం లేదని శ్రవణ్ ప్రశ్నించారు. తెలంగాణ విద్యార్థులు నష్ట పోకుండా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రంలోని కమ్యూనిస్టులకు మద్దతివ్వని కేసీఆర్… జాతీయస్థాయిలో ఉన్న కమ్యూనిస్టులతో పొత్తులకు సిద్ధం అంటున్నారని సీఎంను విమర్శించారు శ్రవణ్ . ఫెడరల్ ఫ్రంట్ అంటూ కేసీఆర్ పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. ఈ విషయంలో జాతీయ నాయకులు కేసీఆర్ తో వెళ్లలేమని తెగేసి చెబుతున్నారన్నారు. కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవడం కోసం కేసీఆర్ ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని శ్రవణ్ అన్నారు. బీజేపీకి కేసీఆర్ మద్దతుదారుడిగా వ్యవహరిస్తున్నారన్నారు. కేసీఆర్ చేస్తున్న పర్యటనలు రాజకీయ యాత్రలుగా లేవని… తీర్ధ యాత్రలుగా ఉన్నాయని శ్రవణ్ విమర్శించారు.