- రాజన్నసిరిసిల్ల జిల్లా సుద్దాలలో ఘటన
కోనరావుపేట, వెలుగు: నెల రోజుల వ్యవధిలో తల్లిదండ్రులు మృతి చెందగా, కొడుకు లేని లోటు రానీయకుండా నలుగురు కూతుళ్లు తల్లి పాడె మోసి అంత్యక్రియలు నిర్వహించారు. వివరాలిలా ఉన్నాయి.. రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం సుద్దాల గ్రామానికి చెందిన ఎగదండి నర్సవ్వ(54) గుండెపోటుతో చనిపోయింది. ఆమె భర్త బాబు ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. ఆయన నెల రోజుల కింద గుండెపోటుతో చనిపోగా, ఆ కుటుంబం పెద్దదిక్కును కోల్పోయింది. భర్త మరణాన్ని తట్టుకోలేక, నలుగురు కూతుళ్లను ఎలా పోషించాలనే మనోవేదనతో నర్సవ్వ కుంగిపోయింది.
రోజువారీ కూలీ పనులకు వెళ్లే నర్సవ్వ శనివారం వ్యవసాయ పనులకు వెళ్లగా అక్కడ గుండెపోటు వచ్చింది. ఆస్పత్రికి తరలించే లోపే ఆమె చనిపోయింది. అప్పటికే తండ్రిని కోల్పోయిపుట్టెడు దుఃఖంలో ఉన్న కూతుళ్లు తల్లి మరణంతో కన్నీరుమున్నీరుగా విలపించారు.
ఆదివారం తల్లి అంతక్రియలు నిర్వహించగా, కూతుళ్లు మమత, స్వప్న, శ్వేత, సింధూజ పాడె మోయగా, ఓ కూతురు తల్లి చితికి నిప్పంటించింది. గతంలో తండ్రి పాడెను కూతుళ్లు మోశారని గ్రామస్తులు గుర్తు చేసుకున్నారు.
కూతుళ్లలో ఇద్దరికి పెళ్లిల్లు కాగా, ఒకరి భర్త చనిపోవడంతో పుట్టింటిలోనే ఉంటోంది. తల్లిదండ్రులను కోల్పోయి, పేదరికంతో అలమటిస్తున్న కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని సర్పంచ్ కుంటెల్లి నాగరాజు, ఉప సర్పంచ్ సాయి, వార్డు సభ్యులు, గ్రామస్తులు కోరుతున్నారు.
