Cricket World Cup 2023: భారత్, న్యూజిలాండ్ సెమీస్‌.. హాజరుకానున్న ఫుట్ బాల్ దిగ్గజం

Cricket World Cup 2023: భారత్, న్యూజిలాండ్ సెమీస్‌.. హాజరుకానున్న ఫుట్ బాల్ దిగ్గజం

వన్డే వరల్డ్ కప్ సెమీ ఫైనల్ కోసం ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి.ఇందులో భాగంగా రేపు (నవంబర్ 15)తొలి సెమీ ఫైనల్లో భారత్, న్యూజీలాండ్ తలపడనున్నాయి. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ చూసేందుకు అభిమానులు ఎంతో ఆసక్తి చూపిస్తుండగా.. ఈ మ్యాచ్ చూడడానికి ఒక స్పెషల్ గెస్ట్ రాబోతున్నాడు. అతడెవరో కాదు ఫుట్ బాల్ లో ఎనలేని కీర్తి సంపాదించిన ఇంగ్లాండ్ మాజీ దిగ్గజ ప్లేయర్ డేవిడ్ బెక్‌హ‌మ్‌. 

యూనిసెఫ్(UNICEF) గుడ్‌విల్ అంబాసిడ‌ర్‌గా ఉన్న బెక్‌హ‌మ్ మూడు రోజుల‌ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా భార‌త్‌కు రానున్నాడు. ఈ క్రమంలో బుధవారం జరగనున్న భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగే సెమీస్ పోరును చూసేందుకు ముంబైలోని వాంఖ‌డే స్టేడియానికి రానున్నాడు. క్రికెట్ దిగ్గజం సచిన్ ఈ మ్యాచ్ కు హాజరు కానుండగా వీరిద్దరూ కలిసి ఈ మ్యాచ్ ను చూసే అవకాశం ఉంది. ఈ ఇద్దరు దిగ్గజాలు ఒకే ఫ్రేమ్ లో కనబడితే అభిమానులకు పండగ చేసుకోవడం ఖాయం. 

సాధారణంగా  ఫుట్ బాల్ మ్యాచ్ లకు క్రికెటర్లు వెళ్లడం చూసాం. కానీ తొలిసారి ఒక ఫుట్ బాల్ దిగ్గజం క్రికెట్ మ్యాచ్ చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నాడు. బెక్‌హ‌మ్‌ ఫుట్ బాల్ ప్లేయర్ అయినా.. ఈ స్టార్ ప్లేయర్ కు క్రికెట్ అంటే ఇష్టం అని తెలుస్తుంది. వరల్డ్ కప్ లాంటి టోర్నీ వస్తే బాగా ఫాలో అవుతుంటాడు. ఇంగ్లండ్ గొప్ప ఫుట్‌బాల‌ర్ల‌లో ఒక‌డైన బెక్‌హ‌మ్ ప్రస్తుతం ఇంట‌ర్ మియామి క్ల‌బ్‌కు సహ య‌జమానిగా ఉన్నాడు. ఈ మ‌ధ్యే ఈ క్ల‌బ్ అర్జెంటీనా కెప్టెన్ లియోన‌ల్ మెస్సీని భారీ ధ‌ర‌కు కొనుగోలు చేశారు.