PSL 2025: వార్నర్ ఫ్యామిలీ టెన్షన్ టెన్షన్.. పాకిస్థాన్ విడిచి వెళ్లేందుకు ఆసీస్ క్రికెటర్ ప్రయత్నాలు

PSL 2025: వార్నర్ ఫ్యామిలీ టెన్షన్ టెన్షన్.. పాకిస్థాన్ విడిచి వెళ్లేందుకు ఆసీస్ క్రికెటర్ ప్రయత్నాలు

ఆపరేషన్ సిందూర్ కారణంగా పాకిస్థాన్ సూపర్ లీగ్ లో ఆడుతున్న ఓవర్సీస్ ప్లేయర్లలో భయాందోళనలు మొదలైనట్లు తెలుస్తోంది. లీగ్ నుంచి తప్పుకోవాలని కొందరు ప్లేయర్లు భావిస్తున్నట్లు మీడియా వర్గాల కథనాల ద్వారా తెలుస్తోంది. ఇందులో భాగంగా ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఉన్నట్టు తెలుస్తోంది. ఇండియా, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో వార్నర్ వీలైనంత త్వరగా పాకిస్తాన్ విడిచి వెళ్లాలని చూస్తున్నట్లు సమాచారం. దేశంలో వార్నర్ భద్రత గురించి అతని కుటుంబం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

ప్రస్తుతం వార్నర్ పాకిస్థాన్ సూపర్ లీగ్ లో కరాచీ కింగ్స్ తరపున ఆడుతున్నాడు. ఈ జట్టుకు వార్నరే కెప్టెన్ కావడం విశేషం. లీగ్ దశ ముగియడానికి దగ్గర పడడంతో ఇకపై ప్లే ఆఫ్స్ మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. మే 18 వరకు ఈ టోర్నీ కొనసాగుతుంది. అప్పటివరకు వార్నర్ పాకిస్థాన్ లో ఉండడానికి ఆసక్తి చూపించడం లేదట. వార్నర్ కెప్టెన్సీలోని కరాచీ కింగ్స్ 8 మ్యాచ్ ల్లో 5 గెలిచి ప్లే ఆఫ్స్ కు చేరువలో ఉంది. ప్రతి ఫ్రాంఛైజ్ కు చెందిన స్క్వాడ్ లో ఐదు నుంచి ఆరు మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు.
   
పాకిస్తాన్ మీడియా సంస్థ డాన్ నివేదిక ప్రకారం, పీసీబీ ప్రతినిధి అమీర్ మీర్, ఎయిర్ స్పేస్ సమస్యల కారణంగా విదేశీ ఆటగాళ్ళు దేశం విడిచి వెళ్ళలేరని వెల్లడించారు. బుధవారం ప్రకటన రావడంతో పాకిస్తాన్ తమ ఎయిర్ స్పేస్‌ను 48 గంటల పాటు మూసివేసింది. అంతేకాకుండా, దీనికి ముందు, ప్రధాన విమానయాన సంస్థలు పాకిస్తాన్ మీదుగా విమానాలు నడపడం మానేయడం ప్రారంభించాయి.

పాకిస్తాన్ ఉగ్రస్థావరాలపై ఇండియా విరుచుకు పడుతుండటంతో.. యుద్ధం తప్పేలా లేదని భావించిన పాక్ క్రికెట్ బోర్డు పలు మ్యాచ్ ల షెడ్యూళ్లను మార్చుకుంది. ఎక్కువ శాతం మ్యాచ్ లను రావల్పిండిలో జరిగేలా షెడ్యూల్ లో మార్పులు చేసుకుంది. ఫైనల్ మ్యాచ్ మే 11న ముల్తాన్ లో జరగనుందని ప్రకటించింది. పహల్గాం ఉగ్రదాడిని సీరియస్ గా తీసుకున్న భారత్.. పాకిస్తాన్ కు తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించింది. చెప్పినట్లుగానే 2025, మే 6  మంగళవారం అర్ధరాత్రి తర్వాత 1.44 గంటలకు పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే)తో పాటు పాక్‌లోని టెర్రరిస్ట్‌ స్థావరాలపై ఇండియన్‌ ఎయిర్‌‌ఫోర్స్‌ విరుచుకుపడింది.