తెలంగాణ రాష్ట్రంలో166 మెడికల్ షాపులకు డీసీఏ నోటీసులు

తెలంగాణ రాష్ట్రంలో166 మెడికల్ షాపులకు డీసీఏ నోటీసులు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మత్తు కలిగించే మందుల అక్రమ అమ్మకాలపై డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) కొరడా ఝుళిపించింది. శనివారం రాష్ట్రవ్యాప్తంగా స్పెషల్ ఎన్‌ ఫోర్స్‌ మెంట్ డ్రైవ్ నిర్వహించి, 166 మెడికల్ షాపులకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ తనిఖీల్లో యువతను, ప్రజలను మత్తుకు బానిసలుగా మారుస్తున్న కోడిన్ కలిగిన కాఫ్ సిరప్‌ లు, నిద్రమాత్రలుగా వాడే నైట్రాజెపామ్, ఆల్ప్రజోలం, ట్రామడాల్, జోల్పిడెమ్ వంటి మందులను డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ లేకుండానే విచ్చలవిడిగా అమ్ముతున్నట్లు అధికారులు గుర్తించారు.

మొత్తం166 మెడికల్ షాపులు రూల్స్ కు విరుద్దంగా ఈ అమ్మకాలు జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు. ఆయా షాపుల యజమానులకు షోకాజ్ నోటీసులు జారీ చేశామన్నారు. వారి సమాధానం ఆధారంగా చర్యలు తీసుకుంటామని డీసీఏ స్పష్టం చేసింది. నేరం రుజువైతే లైసెన్స్‌ లను సస్పెండ్ చేయడం లేదా పూర్తిగా రద్దు చేస్తామని హెచ్చరించింది.