ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో యూరియా కొరత లేదు : డీసీసీబీ చైర్మన్ మామిళ్లపల్లి విష్ణువర్ధన్ రెడ్డి

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో యూరియా కొరత లేదు : డీసీసీబీ చైర్మన్  మామిళ్లపల్లి విష్ణువర్ధన్ రెడ్డి

కొల్లాపూర్, వెలుగు: ఉమ్మడి మహబూబ్ నగర్  జిల్లాలో యూరియా కొరత లేదని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డీసీసీబీ చైర్మన్  మామిళ్లపల్లి విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. బుధవారం పట్టణంలోని డీసీసీబీ ఆఫీస్​లో నియోజకవర్గ పీఏసీఎస్​ చైర్మన్లతో సమావేశం నిర్వహించారు. నాగర్ కర్నూల్  ఎంపీ మల్లు రవి కేంద్రంపై ఒత్తిడి తేవడంతో మంగళవారం 64 వేల మెట్రిక్  టన్నుల యూరియా వచ్చిందని తెలిపారు. 

బుధవారం జడ్చర్లలో 1,800 మెట్రిక్  టన్నులు, గద్వాలలో 2,600 మెట్రిక్  టన్నుల యూరియా దిగుమతి అయినట్లు చెప్పారు. పీఏసీఎస్​లకు60 శాతం, ప్రైవేట్​ డీలర్లకు 40 శాతం యూరియా కేటాయించినట్లు తెలిపారు. పీఏసీఎస్​లలో యూరియా ధర తక్కువగా ఉండడంతో రైతులు ఎక్కువగా వస్తున్నారని చెప్పారు. కృత్రిమ కొరత సృష్టిస్తూ ప్రభుత్వాన్ని బద్​నాం చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర మాలల చైతన్య సమితి రాష్ట్ర వర్కింగ్  ప్రెసిడెంట్  మద్దెల రామదాసు, తాటికోడ కృష్ణ, పీఏసీఎస్​ చైర్మన్లు పెబ్బేటి కృష్ణయ్య, నరసింహారెడ్డి, రామన్ గౌడ్  ఉన్నారు.

అక్రమాలు జరిగితే చర్యలు..

గద్వాల: యూరియా పంపిణీలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని గద్వాల కలెక్టర్  సంతోష్  హెచ్చరించారు. కలెక్టరేట్ లో అగ్రికల్చర్  ఆఫీసర్లతో యూరియా నిల్వలు, అమ్మకాలపై రివ్యూ చేశారు. గత ఏడాది కన్నా ఈ ఏడాది 600 మెట్రిక్  టన్నుల యూరియా ఎక్కువగా అమ్మినప్పటికీ, యూరియా కొరత ఏర్పడిందన్నారు. దీనిపై ఎంక్వైరీ చేయాలని ఆదేశించారు. 

పీఏసీఎస్, ఆగ్రోస్  షాపులలో గత, ఈ ఏడాది అమ్మకాలపై రిపోర్ట్ ఇవ్వాలని సూచించారు. గతంలో కంటే ఎక్కువగా వినియోగిస్తే ఆ షాపులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో ప్రస్తుతం నిల్వ ఉన్న 543 మెట్రిక్  టన్నుల యూరియాను పీఏసీఎస్​ల ద్వారా రైతులకు అందజేయాలన్నారు. డీఏవో సక్రియా నాయక్, ఏడీఏ సంగీతలక్ష్మి పాల్గొన్నారు.