లీడర్లు, జర్నలిస్టులపై నిఘా పెట్టారని కాంగ్రెస్ ఆరోపణ

లీడర్లు, జర్నలిస్టులపై నిఘా పెట్టారని కాంగ్రెస్ ఆరోపణ

న్యూఢిల్లీ: పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా లోక్‌స‌భ‌లో బుధవారం కేంద్రమంత్రి అమిత్ షా, కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ ల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. "దేశంలో పెరుగుతోన్న డ్రగ్స్ సమస్యపై కేంద్రం తీసుకున్న చర్యలు" అనే అంశంపై చర్చ సందర్భంగా గొగోయ్ మాట్లాడారు. పెగాసస్ స్పైవేర్ ద్వారా రాజకీయ నాయకులు, జర్నలిస్టులపై కేంద్ర ప్రభుత్వం రహస్యంగా నిఘా పెట్టిందని ఆయన ఆరోపించారు. దేశంలోని భూ, వాయు, సముద్ర సరిహద్దులతో పాటు ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుల్లో డ్రగ్స్ అక్రమ రవాణాను కట్టడి చేయడానికి బీజేపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టిందో చెప్పాలని అమిత్ షాను గొగోయ్ కోరారు.

రాజకీయ నాయకులు, జర్నలిస్టుల ఫోన్‌లలో రహస్యంగా పెగాసస్(స్పైవేర్) ఇన్ స్టాల్ చేసి వారిపై నిఘా పెట్టారని.. మరి ఈ పెగాసస్ ద్వారా ఎన్ని డ్రగ్- మాఫియాలను పర్యవేక్షించారో.. ఎంత మంది స్మగ్లర్లను పట్టుకున్నారో చెప్పాలని గొగోయ్ నిలదీశారు. ఈ ఆరోపణలపై అభ్యంతరం తెలిపిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. స్పైవేర్​కు సంబంధించిన ప్రూఫ్ ఉంటే వాటిని సభ్యుల ముందు పెట్టాలన్నారు. లేకుంటే గొగోయ్ తన కామెంట్లను వెనక్కి తీసుకోవాలని తెలిపారు.