కృష్ణా నదిలో తగ్గుముఖం పట్టిన వరద

కృష్ణా నదిలో తగ్గుముఖం పట్టిన వరద

వెంట వెంటనే మూతపడ్డ శ్రీశైలం.. నాగార్జునసాగర్ డ్యామ్ గేట్లు

రేపో మాపో జూరాల వద్ద గేట్లు మూసివేసే అవకాశం

విజయవాడకు వరద ముప్పు తప్పినట్టే.. లోతట్టు ప్రాంతాల్లో తొలగని భయం

కృష్ణా నదిలో వరద తగ్గుముఖం పట్టింది. ఎగువన ఆల్మట్టి, తుంగభద్ర డ్యామ్ ల నుండి నీటి విడుదల క్రమంగా తగ్గుతూ ఉండడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో వరద ఉధృతి వేగంగా తగ్గిపోతోంది. అటు నాగార్జునసాగర్.. ఇటు శ్రీశైలం డ్యామ్ ల వద్ద గేట్లు వెంట వెంటనే మూతపడ్డాయి. రేపో మాపో జూరాల డ్యామ్ వద్ద కూడా గేట్లు కూడా మూసివేసే అవకాశం ఉంది. కర్నాటక, మహారాష్ట్రలోని కృష్ణా నది, అటు తుంగభద్ర నది పరివాహక ప్రాంతాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో.. వరద కృష్ణా నదిలో వరద ప్రవాహం ఉధృతి తగ్గిపోయింది. అయితే జూరాల డ్యామ్ కు వరద ఇంకా కొనసాగుతుండడంతో ఇక్కడ రేపటి వరకు ఢోకా లేనట్లే. రేపు వరద పరిస్థితిని బట్టి అవసరమైతే జూరాల డ్యామ్ గేట్లను తగ్గించే అవకాశం ఉందని అధికారుల చెబుతున్నారు.

గతేడాదిలానే ఆగస్టులో భారీ వరద

గత ఏడాది మాదిరే ఈసారి కూడా ఆగస్టులో భారీ వర్షాలు.. వరదలకు కృష్ణా నది ఉగ్రరూపం దాల్చింది. శ్రీశైలం డ్యామ్ నాగార్జునసాగర్ డ్యామ్ లు ఓవర్ ఫ్లో అయ్యాయి.  శ్రీశైలం డ్యాం వద్ద అన్ని గేట్లు ఎత్తి విడుదల చేయగా.. నాగార్జున సాగర్  డ్యామ్ వద్ద వరద పోటుకు అనుగుణంగా డ్యామ్ గేట్లు ఎత్తి మూడున్నర లక్షల క్యూసెక్కులకు పైగా వరదను విడుదల చేశారు. ఊహించని రీతిలోవర్షాలు.. వరదలు వెంటనే తగ్గుముఖం పట్టడంతో.. వరద పోటు కూడా వేగంగా పడిపోయింది. ఫలితంగా కొన్ని గంటల తేడాలో నాగార్జునసాగర్.. శ్రీశైలం డ్యామ్ గేట్లు మూసివేశారు.

కృష్ణా.. తుంగభద్ర నదుల్లో తగ్గుముఖం

కర్నాటక.. మహారాష్ట్రలోని నది పరివాహక ప్రాంతాల్లో వర్షాలు  తగ్గిపోవడంతో ఆల్మట్టి.. తుంగభద్ర నదుల్లో వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. మళ్లీ భారీ వర్షాలు కురిస్తే తప్ప వరద క్రమంగా తగ్గిపోతూ వస్తుందని అధికారులు చెబుతున్నారు. ఆల్మట్టి.. తుంగభద్ర డ్యామ్ ల నుండి వరద నీటి విడుదల వేగంగా పడిపోవడంతో జూరాల మినహాా  శ్రీశైలం.. నాగార్జునసాగర్ డ్యామ్ గేట్లు వెంట వెంటనే  మూతపడిన విషయం తెలిసిందే. శ్రీశైలంలో కుడిగట్టు జల  విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తిని కంటిన్యూ చేస్తుండడం ద్వారా.సాగర్ కు అవుట్ ఫ్లో కొనసాగుతోంది.

విజయవాడ లోతట్టు ప్రాంతాల్లో తొలగని భయం

కృష్ణా.. తుంగభద్ర నదులు శాంతించడంతో విజయవాడ నగరానికి వరద ముంపు తొలగిపోయినట్లేనని అధికారుల అంచనా. కేంద్రజల వనరుల శాఖ ఫోర్ కాస్ట్ బులెటిన్.. ప్రకారం ఎగువ నుండి వరద పోటు తగ్గడంతో ముంపు లేనట్లే కనిపిస్తోంది. లోతట్టు ప్రాంతాలకు మాత్రం ముప్పు తొలగిపోలేదని చెబుతున్నారు. గత ఏడాదిలానే వరద పోటు పెరగడంతో శ్రీశైలం.. నాగార్జునసాగర్ డ్యామ్ లు పూర్తిగా నిండిపోవడంతో విజయవాడకు కూడా వరద పోటెత్తే ప్రమాదం ఉందని అదికారులు ప్రమత్తం  అయ్యారు. జలవనరుల శాఖ హెచ్చరికలతో కృష్ణా జిల్లాలో అధికారులు  లోతట్టు ప్రాంతాల వారి కోసం  వరద పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. అయితే వరద తగ్గుముఖం పట్టింది. అయినా ముంపు ప్రమాదం ఇంకా పూర్తిగా తొలగిపోలేదని అంటున్నారు.

శ్రీశైలం వద్ద ఇన్ ఫ్లో 1 లక్ష 14 వేల క్యూసెక్కులు

ప్రస్తుతం శ్రీశైలం డ్యామ్ వద్ద ఇన్ ఫ్లో 1 లక్ష 14 వేల క్యూసెక్కులు కంటిన్యూ అవుతోంది. తుంగభద్ర నది నుండి సుంకేశుల ద్వారా 26 వేలక్యూసెక్కులు వస్తుండగా.. మిగిలిన  వరద మొత్తం జూరాల నుండి వస్తోంది. డ్యామ్ కెపాసిటీ 885 అడుగులతో 215.807 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 884.40 అడుగులతో 211.9572 అడుగుల నీటి మట్టం ఉంది. ఏపీ పరిధిలోని కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి ద్వారా 31వేల క్యూసెక్కులు దిగువన నాగార్జునసాగర్ కు విడుదల చేస్తున్నారు. అలాగే పోతిరెడ్డిపాడు ద్వారా మరో 35 వేలు.. హంద్రీనీవాకు 2 వేలు వెరశి మొత్తం 68 వేల క్యూసెక్కులు శ్రీశైలం నుండి విడుదల చేస్తున్నారు.

జూరాల డ్యామ్ వద్ద 10 గేట్ల ద్వారా నీటి విడుదల

ఆల్మట్టి నుండి వరద తగ్గినా.. నారాయణపూర్ నుండి వరద పోటెత్తుతుండడంతో జూరాల డ్యామ్ వద్ద 10 గేట్ల ద్వారా నీటి విడుదల కొనసాగుతోంది. ప్రస్తుతం 96 వేల క్యూసెక్కులు వస్తుండగా.. దిగువన శ్రీశైలానికి 10 గేట్ల ద్వారా 68 వేల క్యూసెక్కులు.. విద్యుత్ ఉత్పత్తి ద్వారా మరో 29 వేల 525 క్యూసెక్కులు.. నెట్టెంపాడుకు 750.. పార్లల్ కెనాల్ కు 300 క్యూసెక్కుల చొప్పున మొత్తం 1 లక్ష  క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. ఆల్మట్టి నుండి వరద తగ్గే అవకాశం ఉన్నా.. నారాయణపూర్ నుండి కొనసాగుతుండడంతో రేపు వరద ప్రవాహాన్ని బట్టి గేట్లు దించే అవకాశం ఉంది. జూరాల డ్యామ్ మొత్తం కెపాసిటీ 318.230 మీటర్లతో 9.657 టీీీీీఎంసీలు కాగా.. ప్రస్తుతం డ్యామ్  వద్ద 318.230 మీటర్లతో 9.070 టీఎంసీల నీటి నిల్వ  మెయిన్ టెయిన్ చేస్తున్నారు.