ఇయ్యాల్నే ఆఖరు తేదీ..డబ్బుల్లేక పేద విద్యార్థుల అవస్థలు

ఇయ్యాల్నే ఆఖరు తేదీ..డబ్బుల్లేక పేద విద్యార్థుల అవస్థలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో సర్కార్ డిగ్రీ కాలేజీల్లోనూ ఫీజుల వసూళ్ల పర్వం మొదలైంది. సర్కారు ఫీజు రీయింబర్స్​మెంట్ ఇవ్వనందుకే ఫీజులు వసూలు చేస్తున్నట్టు కాలేజీల సిబ్బంది చెప్తున్నారు. గవర్నమెంట్ కాలేజీల్లో ఎలాంటి ఫీజులు వసూలు చేయొద్దనే నిబంధనలు ఉన్నా, ఉన్నతాధికారుల ఆదేశాలతోనే ముక్కుపిండి వసూళ్లు చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. మంచి కాలేజీల్లో సీటు వచ్చినా, ఫీజు కట్టలేక పేద విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. అయినా.. మొత్తం కోర్సు ఫీజు కడితేనే అడ్మిషన్ ఇస్తామని కాలేజీలు తేల్చిచెబుతున్నాయి. యూనివర్సిటీ అనుబంధ, అటానమస్ కాలేజీల్లోనూ ఇదే తంతు నడుస్తోంది. 

విద్యార్థుల అవస్థలు  

రాష్ట్రంలో 1,060 డిగ్రీ కాలేజీలున్నాయి. వీటిలో డిగ్రీ ఆన్​లైన్ సర్వీసెస్, దోస్త్ పరిధిలో 962 కాలేజీలుండగా, వాటిలో 4.68 లక్షల సీట్లున్నాయి. తెలంగాణ మహిళా యూనివర్సిటీతో పాటు ఉస్మానియా, కాక‌‌తీయ‌‌, తెలంగాణ‌‌, మ‌‌హాత్మాగాంధీ, పాల‌‌మూరు, శాత‌‌వాహ‌‌న యూనివ‌‌ర్సిటీల ప‌‌రిధిలోని కాలేజీల్లో డిగ్రీ సీట్లను దోస్త్ ద్వారానే భర్తీ చేస్తున్నారు. జులైలో ప్రారంభమైన దోస్త్ డిగ్రీ అడ్మిషన్ల ప్రక్రియ, ఇప్పటికి మూడు విడుతలు కొనసాగింది. ఈ నెల 22లోపు మూడు విడుతల్లో సీట్లు పొందిన విద్యార్థులు అలాటైన కాలేజీల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంది. అయితే సర్కారు కాలేజీల్లో సీట్లు అలాటైన విద్యార్థులకు ఫీజుల కష్టాలు మొదలయ్యాయి. మొత్తం కోర్సు ఫీజు కట్టాల్సిందేనని తేల్చిచెబుతుండటంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

రూ. 3 వేల నుంచి 40 వేల వరకూ.. 

ప్రస్తుతం ఒక్కో కోర్సుకు ఒక్కో ఫీజు ఉంది. సర్కారు కాలేజీల్లో కాలేజీని బట్టి రూ.3 వేల నుంచి రూ.40 వేల వరకూ ఫీజులున్నాయి. వీటిలో రెగ్యులర్ కోర్సులకు రూ.10 వేల లోపే ఫీజు ఉండగా, సెల్ఫ్​ ఫైనాన్స్ కోర్సులకు భారీగా ఫీజులు నిర్ణయించారు. గతంలో కాలేజీల్లో జాయినింగ్ ఫీజు నామమాత్రంగా ఉండేది. కోర్సు ఫీజు మొత్తం సర్కారు ఫీజు రీయింబర్స్ మెంట్ కింద కాలేజీలకు ఇచ్చేది. సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల్లో మాత్రం సర్కారు నిర్ణయించిన ఫీజును మాత్రమే చెల్లించగా, మిగిలిన మొత్తం స్టూడెంట్లు కట్టుకునేవారు. ఈ ఏడాది మాత్రం మొత్తం కోర్సు ఫీజు కట్టాల్సిందేనని కాలేజీల అధికారులు పట్టుపడుతున్నారు. ఇక యూనివర్సిటీ కాలేజీల్లో 40 సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులుండగా, వాటిలో 3 వేలకుపైగా సీట్లున్నాయి. ఈ సీట్లకు  రూ.25 వేల నుంచి రూ.40 వేల వరకూ ఫీజు ఉంది. వీటిలో కొంత సర్కారు చెల్లిస్తుంది. అయినా కాలేజీలు బలవంతంగా ఫీజులు వసూలు చేస్తున్నాయి.