చేర్యాల, వెలుగు: డిగ్రీ మొదటి సంవత్సరంలో నాలుగు సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యాననే మనస్తాపంతో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. చేర్యాల మండలకేంద్రంలోని గడితోటకు చెందిన పిట్టల మంజుల ఆశా వర్కర్‌గా పనిచేస్తూ వ్యవసాయ పనులు చేసుకుంటూ తన ఇద్దరు కొడుకులను పెంచుతోంది. ఆమె భర్త 13 ఏళ్ల క్రితమే మృతిచెందాడు.
చిన్న కొడుకు పిట్టల గణేశ్(20) చేర్యాల ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఇటీవల నిర్వహించిన తొలి సెమిస్టర్ పరీక్షల్లో నాలుగు సబ్జెక్టుల్లో ఫెయిల్ కావడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.
ప్రస్తుతం సప్లిమెంటరీ పరీక్షలు రాస్తున్నప్పటికీ, అవి కూడా సరిగా రాయలేకపోతున్నానంటూ కుటుంబ సభ్యుల వద్ద ఆవేదన వ్యక్తం చేశాడు. గురువారం మధ్యాహ్నం పరీక్ష రాసేందుకు వెళ్తున్నానని ఇంటి నుంచి బయలుదేరిన గణేశ్సమీపంలోని బావి వద్ద ఉన్న చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు చేర్యాల ఎస్సై అపూర్వారెడ్డి తెలిపారు.
