వడోదరా: విమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో ముంబై ఇండియన్స్ హ్యాట్రిక్ పరాజయాలను నమోదు చేసింది. బ్యాటింగ్‌లో సివర్ బ్రంట్ (65 నాటౌట్) రాణించినా.. బౌలర్లు ఫెయిల్ కావడంతో.. మంగళవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో ముంబై 7 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఓడింది. టాస్ ఓడిన ముంబై 20 ఓవర్లలో 154/5 స్కోరు చేసింది. హర్మన్‌ప్రీత్ కౌర్ (41) ఫర్వాలేదనిపించింది. తర్వాత ఢిల్లీ 19 ఓవర్లలో 155/3 స్కోరు చేసి గెలిచింది. కెప్టెన్ జెమీమా రోడ్రిగ్స్ (51 నాటౌట్) టాప్ స్కోరర్. ఓపెనింగ్‌లో షెఫాలీ వర్మ (29), లిజెల్లి లీ (46) వేగంగా ఆడారు. పవర్‌ప్లేలో 57 రన్స్ జోడించి శుభారంభాన్నిచ్చారు. అయితే మూడు ఓవర్ల తేడాలో ఈ ఇద్దరూ ఔట్ కావడంతో డీసీ 84/2తో నిలిచింది. వన్‌డౌన్‌లో లారా వోల్‌వర్ట్ (17) ఫెయిలైనా.. జెమీమా సూపర్ ఇన్నింగ్స్ ఆడింది. ముంబై బౌలర్లపై ఫోర్లు, సిక్స్‌లతో విరుచుకుపడింది. మూడో వికెట్‌కు 34 రన్స్ జోడించి లారా వెనుదిరిగినా.. జెమీమా చివరి వరకు నిలబడింది. 36 బాల్స్‌లో హాఫ్ సెంచరీ చేసింది. మారిజానె కాప్ (10 నాటౌట్)తో కలిసి మరో ఓవర్ మిగిలి ఉండగానే విజయాన్ని అందించింది. జెమీమాకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
బ్రంట్, హర్మన్ జోరు..
ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబైని ఆరంభంలో ఢిల్లీ బౌలర్లు కట్టడి చేశారు. ఫలితంగా తొలి ఐదు ఓవర్లలోనే సాజీవన్ సజన (9), హేలీ మాథ్యూస్ (12) ఔటయ్యారు. 21/2తో కష్టాల్లో పడిన ఇన్నింగ్స్‌ను సివర్ బ్రంట్, హర్మన్ గట్టెక్కించారు. డీసీ బౌలింగ్‌ను దీటుగా ఎదుర్కొని రన్స్ రాబట్టారు. ఈ క్రమంలో రెండు భారీ సిక్స్‌లు కొట్టిన బ్రంట్ 34 బాల్స్‌లో హాఫ్ సెంచరీ పూర్తి చేసింది. రెండో ఎండ్‌లో ఫోర్లతోనే ముందుకెళ్లిన కౌర్ కూడా వేగంగా ఆడింది. ఈ క్రమంలో మూడో వికెట్‌కు 78 రన్స్ జోడించారు. ఈ దశలో శ్రీచరణి (3/33) ముంబైకి ఝలక్ ఇచ్చింది. 14వ ఓవర్‌లో కౌర్‌ను ఔట్ చేసిన శ్రీచరణి 18వ ఓవర్‌లో ఐదు బాల్స్ తేడాలో నికోలా కెరీ (12), అమన్‌జోత్ కౌర్ (3)ను పెవిలియన్‌కు పంపింది. చివర్లో సంస్కృతి గుప్తా (10 నాటౌట్) ధనాధన్ షాట్లతో చెలరేగడంతో ముంబై మంచి స్కోరు సాధించింది.
సంక్షిప్త స్కోర్లు
ముంబై: 20 ఓవర్లలో 154/5 (బ్రంట్ 65*, హర్మన్ 41, శ్రీచరణి 3/33). ఢిల్లీ: 19 ఓవర్లలో 155/3 (జెమీమా 51*, లిజెల్లీ లీ 46, వైష్ణవి 1/20).
