ప్రశ్నించడం పరువునష్టం కిందకు రాదు.. పర్వేశ్ వర్మ పిటిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కొట్టివేసిన ఢిల్లీ కోర్టు

ప్రశ్నించడం పరువునష్టం కిందకు రాదు..    పర్వేశ్ వర్మ పిటిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కొట్టివేసిన ఢిల్లీ కోర్టు
  • ఆప్ నేత సౌరభ్ పై నమోదైన డిఫమేషన్​కేసు కొట్టివేత

న్యూఢిల్లీ: ఢిల్లీ డిప్యూటీ సీఎం పర్వేశ్ వర్మకు స్థానిక కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకుడు సౌరభ్ భరద్వాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై పర్వేశ్  వర్మ దాఖలు చేసిన క్రిమినల్​ డిఫమేషన్ కేసును ఢిల్లీ కోర్టు కొట్టివేసింది. ఒక ప్రజాప్రతినిధిని లేదా ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ఏమాత్రం పరువునష్టం కిందకు రాదని న్యాయస్థానం స్పష్టం చేసింది. 

సౌరభ్ భరద్వాజ్ 'ఎక్స్' వేదికగా చేసిన పోస్టులు, వీడియోలు ప్రభుత్వాన్ని ప్రశ్నించేలా, విమర్శించేలా ఉన్నాయే తప్ప, ఎవరినీ వ్యక్తిగతంగా అవమానించే ఉద్దేశంతో చేసినవి కావు అని కోర్టు అభిప్రాయపడింది. ‘ప్రజాస్వామ్యంలో పత్రికలకు, ప్రజలకు ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ఉంది. అదే సమయంలో తమ అభిప్రాయాలకు భిన్నమైన ఆలోచనలను వినే ఓపిక, బాధ్యత ఎన్నికైన ప్రజాప్రతినిధులకూ ఉండాలి’ అని కోర్టు వ్యాఖ్యానించింది. 

తన సోషల్ మీడియా పోస్టుల ద్వారా భరద్వాజ్ అవినీతి, స్వజన పక్షపాతం మోపారని, పోక్సో కేసు నిందితుడికి కొమ్ముకాశారని తప్పుడు ఆరోపణలు చేసి తన ప్రతిష్టను దిగజార్చారని పర్వేశ్ వర్మ కోర్టును ఆశ్రయించారు. అయితే, వర్మ వాస్తవాలను దాచి కోర్టును ఆశ్రయించారని వ్యాఖ్యానిస్తూ, 
ప్రతిపక్షంలో ఉన్న నాయకుడు ప్రభుత్వాన్ని నిలదీయడం ప్రజాస్వామ్య బద్ధమైన బాధ్యత అని పేర్కొంటూ కోర్టు ఈ కేసును కొట్టివేసింది.